ఇన్నాళ్లూ కొత్తవాళ్లతో, కాస్త ఇమేజ్ ఉన్న వాళ్లతో సినిమాలు చేసి సక్సెస్‌లు అందుకున్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ధనుష్ లాంటి సూపర్‌స్టార్‌ని హ్యాండిల్ చేయడం మాత్రం ఆయనకి ఇదే ప్రథమం. పైగా ఇందులో మరో సూపర్‌స్టార్ కూడా ఉన్నారు. ఆయనే అక్కినేని నాగార్జున. దాంతో ఈ హైబడ్జెట్ సోషల్ డ్రామాని శేఖర్ కమ్ముల ఎలా తీస్తున్నాడు? అనే విషయంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొని ఉన్నది. ఇదిలావుంటే.. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలైంది.
ఈ సినిమాకోసం వేసిన భారీ సెట్లో యాక్షన్ సన్నివేశాలను తీస్తున్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ధనుష్, నాగార్జున ఇద్దరూ ఈ షూట్లో ఉన్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇది సాధారణమైన యాక్షన్ సినిమా కాదట. ఇందులో మైథలాజికల్ అంశాలు కూడా ఉంటాయట. సినిమాపేరు ‘కుబేర’ అని పెట్టారు కాబట్టి, సంపద ప్రసాదించే దైవమైన కుబేరుడు పాత్ర కూడా ఇందులో ఉంటుందని తెలుస్తున్నది. టాకీ పార్ట్ దాదాపు పూర్తికావచ్చింది.
మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ధనుష్, నాగార్జునల ఫస్ట్‌లుక్ పోస్టర్లను ఇప్పటికే విడుదల చేశారు. శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రై.లిమిటెడ్ పతాకాలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో రష్మిక మందన్న, జిమ్ సర్భ్ ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.