తమిళ అగ్ర హీరో ధనుష్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు చెన్నై సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. సాధారణంగా ఫ్యాన్స్మీట్స్కు దూరంగా ఉండే ధనుష్ ఇక నుంచి ప్రతి ఆదివారం అభిమానుల్ని కలుసుకుంటానని, వారితో ఫొటోలు కూడా తీసుకుంటానని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్తులో రాజకీయ రంగప్రవేశం కోసం ధనుష్ రంగం సిద్ధం చేస్తున్నారని, అందుకే ఫ్యాన్స్మీట్కు సిద్ధమయ్యారని అంటున్నారు.
అభిమానులను కలుసుకునేందుకు ధనుష్ చెన్నైలోని ఓ స్టూడియోను 25 వారాల పాటు బుక్ చేసుకున్నారట. ప్రతి ఆదివారం ఆయన 500 మంది అభిమానుల్ని కలుస్తారని, వారికి ఫొటోగ్రాఫ్ అందిస్తారని ధనుష్ టీమ్ వెల్లడించింది. గతంలో రజనీకాంత్, దళపతి విజయ్ సైతం ప్రతీ ఆదివారం ఫ్యాన్స్మీట్ ఏర్పాటు చేసేవారు.
ఆరోగ్య సమస్యల కారణంగా రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశాన్ని విరమించుకోగా..దళపతి విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్, విజయ్ తరహాలోనే ధనుష్ ఫ్యాన్స్మీట్కు పూనుకోవడం తమిళనాట ఆసక్తికరంగా మారింది. ఇటీవలే ‘కుబేర’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు ధనుష్. ప్రస్తుతం ఆయన తమిళంలో ‘ఇడ్లీ కడాయ్’, హిందీలో ‘తేరే ఇష్క్ మే’ చిత్రాల్లో నటిస్తున్నారు.