తమిళ నటుడు ధనుష్, ఆయన సతీమణి ఐశ్వర్య రజనీకాంత్ విడాకుల కేసు విచారణలో భాగంగా గురువారం చెన్నై ఫ్యామిలీ కోర్టు ఎదుట హాజరయ్యారు. తామిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నామని, కలిసి ఉండటం సాధ్యం కాదని న్యాయస్థానానికి తెలిపారు. విడిపోవడానికి గల కారణాలను కోర్టుకు తెలియజేశారు.
ఈ నేపథ్యంలో కోర్టు తుది తీర్పును ఈ నెల 27కు వాయిదా వేసింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె అయిన ఐశ్వర్యను 2004 నవంబర్ 18న వివాహమాడారు ధనుష్. దాదాపు పద్దెనిమిది సంవత్సరాల పాటు వీరి దాంపత్యం సజావుగానే సాగింది.
తామిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నామని ధనుష్ రెండేళ్ల క్రితం సోషల్‌మీడియాలో పెట్టిన పోస్ట్ ద్వారా వెల్లడించారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతుండగా.. వారిద్దరూ కోర్టుకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో మనస్పర్థలను పక్కనబెట్టి వారిద్దరూ మరలా ఒక్కటి కాబోతున్నారని ప్రచారం జరిగింది. తాజా విచారణతో ఈ జంట విడిపోవడానికే నిర్ణయించుకున్నట్లు స్పష్టమైంది.