‘బలగం’ వేణు దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించనున్న ‘ఎల్లమ్మ’ సినిమాలో కథానాయకుడిగా నటించేదెవరు? అనే విషయం ఇన్నాళ్లూ ఓ ప్రహసనంగా సాగింది. ఈ క్రమంలో చాలామంది హీరోల పేర్లు వినిపించాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం అగ్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇందులో హీరోగా నటించే అవకాశాలున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్‌లో ఓ ఊహించని వార్త బలంగా వినిపిస్తున్నది. గత పదిహేనేళ్లుగా దేవిశ్రీని కథానాయకుడిగా పరిచయం చేసేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆయన మాత్రం ససేమిరా అంటూ వచ్చారు.
అయితే.. ఎందుకో ‘ఎల్లమ్మ’ కథ విని ఆయన ఆలోచనలో పడ్డట్టు ఫిల్మ్ వర్గాల సమాచారం. కొందరైతే ఇది ఎల్లమ్మతల్లి నిర్ణయమేనంటూ పోస్టులు పెడుతున్నారు. అదే నిజమైతే ‘ఎల్లమ్మ’ సినిమా స్థాయి ఇంకాస్త పెరిగినట్టే. ఇందులో కథానాయికగా కీర్తి సురేశ్ దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తున్నది. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సివుంది.