‘మనిషికి బతికేంత ధైర్యం చాలు.. చంపేంత ధైర్యం కాదు. కాదూ కూడదు అని మళ్లీ ఆ ధైర్యాన్ని కూడగడితే.. ఆ ధైర్యాన్ని చంపే భయాన్నవుతా..’ ఈ డైలాగ్‌లోనే ‘దేవర’ సినిమా కథంతా ఉంది. 2 నిమిషాల 35 సెకన్లున్న ఈ థియేట్రికల్ ట్రైలర్ అదే చెప్పింది. మంగళవారం ముంబైలో ఎన్టీఆర్ ‘దేవర’ ట్రైలర్‌ను ఘనంగా విడుదల చేశారు. కరణ్‌జోహార్, అనిల్ తడాని వంటి బాలీవుడ్ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఓ ప్రత్యేకమైన ప్రపంచం ఈ ట్రైలర్లో కనిపించింది. అభిమానులతో పాటు యాక్షన్ మూవీ లవర్స్ కోరుకునే అంశాలతో దర్శకుడు కొరటాల శివ ఈ ట్రైలర్‌ని తీర్చిదిద్దాడు. ప్రకాశ్‌రాజ్ వాయిస్‌ఓవర్‌తో ఈ ట్రైలర్ మొదలైంది. బైరా (సైఫ్ అలీఖాన్) తన క్రూరమైన గ్యాంగ్‌తో తీరప్రాంతంలో అకృత్యాలకు తెగబడుతుంటాడు.
ప్రశాంతంగా బతుకుతున్న తీరప్రాంత ప్రజల జీవితాల్లో అలజడి సృష్టించడమే కాకుండా, ఓడలను దోచుకుంటూ, కోస్ట్ గార్డులను చంపుతూ రక్తపాతాన్ని సృష్టిస్తుంటాడు. అలాంటి కరుడుగట్టిన రక్తపిపాసులకు భయాన్ని పరిచయం చేస్తాడు ‘దేవర’ (ఎన్టీఆర్). ఆ గ్రామాన్ని పెను ప్రమాదం నుంచి కాపాడతాడు. ఈ ట్రైలర్లో తారక్ స్క్రీన్ ప్రెజన్స్, డైలాగ్ డెలివరీ, ఎలివేషన్స్ గూజ్బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ఒకడు భయస్తుడుగా, ఒకడు భయాన్ని పరిచయం చేసేవాడుగా.. తారక్ రెండు రకాలుగా ట్రైలర్లో కనిపిస్తున్నాడు. తారక్, జాన్వీ కెమిస్ట్రీతోపాటు యాక్షన్ సన్నివేశాలకు అనిరుధ్ ఇచ్చిన ఆర్ఆర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేలా ఉంది. ఈ నెల 27 ఈ సినిమా తొలి పార్ట్ విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, నిర్మాతలు: మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె, సమర్పణ: నందమూరి కల్యాణ్‌రామ్.