Actor | ఒక ఐస్ క్రీమ్ తిన్నంత మాత్రాన ఇంత పెద్ద అనర్థమా? అని అనిపించొచ్చు. కానీ అలాంటి విషాదాన్ని తన జీవితంలో అనుభవించాడని చెబుతున్నారు ప్రముఖ సీనియర్ నటుడు దేవన్ శ్రీనివాసన్. విలన్ పాత్రలతో తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ నటుడు, తన వ్యక్తిగత జీవితంలోని చేదు సంఘటనను పంచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. “ఏ మాయ చేసావే”, “మా అన్నయ్య”, “ఢమరుకం”, “సాహో” వంటి పలు తెలుగు చిత్రాల్లో నటించిన దేవన్, తెరపై విలన్గా కనిపించినా, నిజజీవితంలో పెద్ద విషాదాన్ని ఎదుర్కొన్నారు. తన భార్య సుమ మరణం వెనుకున్న కారణాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
దేవన్ వెల్లడిస్తూ.. 2019లో నా భార్య అలర్జీ కారణంగా మరణించింది. ఆమె పూర్తిగా ఆరోగ్యంగా ఉండేది. కానీ ఐస్ క్రీమ్ మాత్రం ఆమెకు ఏమాత్రం పడేది కాదు. ఒకసారి చెన్నైలో మేమిద్దరం కలిసి ఐస్ క్రీమ్ తిన్నప్పుడు ఆమెకు ఊపిరి ఆడకపోవడం మొదలైంది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. ఆ తర్వాత డాక్టర్లు స్పష్టంగా హెచ్చరించారు . ఇకపై ఎప్పటికీ ఐస్ క్రీమ్ తినొద్దని. అప్పటి నుంచి ఆమె జాగ్రత్తగా దూరంగా ఉండేది అన్నారు. అయితే ఒక రోజు మా కూతురు తన పిల్లల కోసం ఇంటికి ఐస్ క్రీమ్ తీసుకొచ్చింది. తిన్న తర్వాత కొంత మిగలడంతో ఫ్రిజ్లో పెట్టి వెళ్లిపోయింది.
నేను షూటింగ్లో ఉండగా నా భార్య ఆ ఐస్ క్రీమ్ తిన్నది. ఆ వెంటనే ఆమె శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడింది. ఇంట్లో ఉన్నవారు ఆందోళనగా నాకు ఈ విషయం చెప్పగానే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాను. కానీ అప్పటికి ఆలస్యమైపోయింది. ఊపిరితిత్తుల్లో రంధ్రాలు ఏర్పడి, శ్వాస ఆడక ఆమె మృతి చెందింది అని దేవన్ ఆవేదన వ్యక్తం చేశారు. దేవన్ చెప్పిన ఈ సంఘటన విన్న వారందరూ షాక్ అయ్యారు. *“ఒక చిన్న అలర్జీని నిర్లక్ష్యం చేస్తే ఎంతటి విషాదం జరుగుతుందో ఇది స్పష్టంగా చూపిస్తుంది. డాక్టర్ల సూచనలను తప్పక పాటించాలి. లేకపోతే ఇలాంటి చేదు పరిణామాలు తప్పవు అని ఆయన హెచ్చరించారు.