తెలుగు సినీరంగంలో పబ్లిసిటీ డిజైనర్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు వివ రెడ్డి. బొమ్మరిల్లు, చంద్రముఖి, దేశముదురు, పోకిరీ, జై బోలో తెలంగాణ వంటి హిట్ చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. పబ్లిసిటీ డిజైనర్‌గా వివ రెడ్డి పాతికేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఇటీవల ఆయన జన్మదినాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మా స్వస్థలం వరంగల్. 1999లో హైదరాబాద్ వచ్చాను.
జేఎన్టీయూ యూనివర్సిటీలో బీఎఫ్ఏ పూర్తి చేశాను. ‘దిల్’ సినిమా టైటిల్ లోగోతో డిజైనర్‌గా సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టా. ఇప్పటివరకు 500పైగా సినిమాలకు పబ్లిసిటీ డిజైనర్‌గా పని చేశాను. ఎందరో స్టార్ హీరోల చిత్రాలకు చేసిన టైటిల్ లోగోలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. దాసరి నారాయణరావు, వంశీ వంటి దర్శకుల ప్రశంసలందుకోవడం మరచిపోలేని అనుభూతినిచ్చింది’ అన్నారు. పబ్లిసిటీ డిజైన్‌తో పాటు నటుడిగా రాణిస్తున్నానని, ఇప్పటివరకు 25 సినిమాల్లో నటించానని వివ రెడ్డి తెలిపారు. ‘ప్రస్తుతం ఓ తండ్రి తీర్పు, లగ్గం వంటి సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ చేస్తున్నా. మరింత సృజనాత్మకంగా ఆలోచిస్తూ పబ్లిసిటీ డిజైనింగ్‌తో పాటు నటుడిగా రాణించాలనుకుంటున్నా’ అని ఆయన పేర్కొన్నారు.