Ram Charan | మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి చిత్ర బృందం వినూత్నంగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. తాజాగా రామ్ చరణ్, బుచ్చిబాబు కలిసి కార్ డ్రైవ్ చేస్తూ చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఇంటర్వ్యూలో దర్శకుడు బుచ్చిబాబు.. “సినిమాలో మీకు అత్యంత ఇష్టమైన ఎపిసోడ్ ఏది?” అని ప్రశ్నించగా, రామ్ చరణ్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినిమాలో వచ్చే ఢిల్లీ ఎపిసోడ్ తనకు ఎంతో ప్రత్యేకమని, కథలో అదే కీలక మలుపులకు కేంద్రబిందువుగా నిలుస్తుందని తెలిపారు.
ఈ ఎపిసోడ్లో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయని చరణ్ పేర్కొన్నారు. అంతేకాకుండా, బుచ్చిబాబు తొలి చిత్రం ఉప్పెన క్లైమాక్స్‌తో దీనిని పోల్చుతూ.. “ఉప్పెనలోని ట్విస్ట్ కంటే 100 రెట్లు ఎక్కువ షాకింగ్ మూమెంట్స్ ఢిల్లీ ఎపిసోడ్లో ఉంటాయి” అని వ్యాఖ్యానించారు. రామ్ చరణ్ చేసిన ఈ వ్యాఖ్యలతో పెద్ది చిత్రంపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా క్లైమాక్స్, కథలోని మలుపులు ప్రేక్షకులకు ఊహించని అనుభూతిని ఇవ్వబోతున్నాయనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. సినిమా విడుదలకు ముందే ఈ స్థాయిలో హైప్ రావడంతో పెద్ది బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.
మరోవైపు పెద్ది ట్రైలర్ కొద్ది రోజుల క్రితం విడుదల కాగా, ఈ కట్కు కొంత మిక్స్డ్ టాక్ రాగా మరో ట్రైలర్ రిలీజ్ చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఇక భోపాల్‌లో రెహమాన్ మ్యూజికల్ ఈవెంట్ భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ఇదే ఈవెంట్లో స్పెషల్ సాంగ్ రిలీజ్ చేయనున్నారు. అదే రోజు మరో ట్రైలర్ రిలీజ్ చేయనున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. దీనిపై క్లారిటీ రావలసి ఉంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు.