కేవలం ఒక్క గ్లింప్స్‌తో ‘పెద్ది’ సినిమా గురించి ప్రపంచం మాట్లాడుకునేలా చేశారు దర్శకుడు బుచ్చిబాబు సానా. రెండు చేతులతో రామ్‌చరణ్ క్రికెట్ బ్యాట్ హ్యాండిల్‌ని బలంగా పట్టుకొని, ఫ్రెంట్ కొచ్చి.. దాన్ని నేలపై గుద్ది మరీ బంతిని బాదిన షాట్ ఏదైతే ఉందో.. ప్రస్తుతం ఆ షాట్ ప్రపంచవ్యాప్తంగా ఓ సంచలనం. కొందరైతే ఆ షాట్‌ని అనుకరిస్తూ ఇన్‌స్టాలో రీల్స్ కూడా చేస్తున్నారు. ‘పెద్ది’ గ్లింప్స్ దెబ్బ అలా ఉందన్నమాట. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా సినిమాకోసం సినీప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రీడా నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో రామ్‌చరణ్ ఊరమాస్ అవతారంలో ప్రేక్షకుల్ని థ్రిల్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ పూర్తి చేసుకున్నది. నెక్ట్స్ షెడ్యూల్‌ని ఈ నెల 12 నుంచి మేకర్స్ మొదలుపెట్టబోతున్నారు.
ఢిల్లీలో జరిగే ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ఈ షెడ్యూల్లోనే రామ్‌చరణ్, జాన్వీకపూర్‌లపై కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా తీస్తారని సమాచారం. పనిలోపనిగా ఒకట్రెండు పాటల్ని కూడా షూట్ చేస్తారట. ఈ సినిమాకు ఇంకా 40రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఆగస్ట్ వరకూ జరిగే ఈ షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుందని, త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభిస్తామని మేకర్స్ చెబుతున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ పాన్ ఇండియా సినిమా విడుదల కానుంది. శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందుశర్మ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్.రత్నవేలు, సంగీతం: ఏ.ఆర్.రెహమాన్, ఎడిటింగ్: నవీన్ నూలి, నిర్మాత: వెంకటసతీష్ కిలారు, సమర్పణ: మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్, నిర్మాణం: వృద్ధి సినిమాస్.