Jacqueline Fernandez | బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మనీలాండరింగ్ కేసులో తనపై దాఖలైన ఎఫ్ఐఆర్, ఈడీ ఛార్జిషిట్ను రద్దు చేయాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో జాక్వెలిన్ క్రిమినల్ విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది.
ఈ కేసుపై ఈడీ తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపిస్తూ, ప్రత్యేక కోర్టు ఇప్పటికే ఛార్జిషీటును విచారణకు స్వీకరించిందని, ప్రాథమికంగా ఈ కేసులో నేరం జరిగిందని నిర్ధారించిందని కోర్టుకు తెలిపారు. ట్రయల్ కోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వులను జాక్వెలిన్ సవాలు చేయలేదని, కాబట్టి ఆమె పిటిషన్ విచారణకు అర్హం కాదని ఈడీ పేర్కొంది.
సుకేష్ చంద్రశేఖర్‌తో సంబంధం ఉన్న రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నిందితురాలిగా ఉంది. రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్ల భార్యల నుంచి సుకేష్ చంద్రశేఖర్ మోసపూరితంగా రూ. 200 కోట్లు వసూలు చేశాడన్న ఆరోపణలపై ప్రస్తుతం జైలులో ఉన్నాడు. ఈ అక్రమ సొమ్మును హవాలా మార్గాల ద్వారా తరలించి, షెల్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టేందుకు సుకేష్, అతని భార్య లీనా పౌలోస్ ప్రయత్నించారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ కేసు విచారణ కొనసాగుతుంది.