Deepika Padukone | బాలీవుడ్ నటి దీపికా పదుకొణె ప్రతిపాదించిన 8 గంటల పని విధానం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కేంద్ర మాజీ మంత్రి, నటి స్మృతి ఇరానీ తాజాగా స్పందించారు. ప్రస్తుతం ఆమె దాదాపు 20 ఏళ్ల తర్వాత ‘క్యోంకీ సాస్ భీ కభీ బహూ థీ 2’ సీరియల్‌తో టెలివిజన్ రంగంలోకి తిరిగి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన స్మృతి, దీపిక వ్యాఖ్యలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది పూర్తిగా దీపికా వ్యక్తిగత అభిప్రాయం. కానీ నటులు నిర్మాతల పరిస్థితులు కూడా అర్థం చేసుకోవాలి. కొన్ని వివాదాలు కేవలం సంచలనం కోసం సృష్టిస్తారు .
అటువంటి వాటిలో పాల్గొనేంత అమాయకురాలిని నేను కాదు. నటులుగా మనం చేసే పనికి బాధ్యత, నిబద్ధత అవసరం. ఈ రోజు పని చేయాలని అనిపించడం లేదని చెప్పడం వృత్తిపరంగా సరైంది కాదు. నేను సీరియల్స్ చేస్తున్నప్పుడు రెండు సార్లు గర్భవతిని అయ్యాను, అయినా షూటింగ్ కొనసాగించాను. ఒక్క రోజు నటుడు రాకపోతే 120 మందికి ఆ రోజు జీతం ఆగిపోతుంది. అది 120 కుటుంబాలకు అన్యాయం అవుతుంది” అంటూ స్మృతి ఇరానీ పేర్కొన్నారు. తాను ఎప్పుడూ నిర్మాతలకు లాభాలు రావాలని అంకితభావంతో పనిచేస్తానని స్మృతి స్పష్టం చేశారు
ఇటీవల తల్లిగా మారిన దీపికా పదుకొణె, ప్రభాస్‌తో చేయాల్సిన ‘స్పిరిట్’ మరియు ‘కల్కి 2’ ప్రాజెక్టుల నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆమె కేవలం 8 గంటలపాటు మాత్రమే పనిచేస్తానని, అదనంగా రెమ్యునరేషన్ కూడా పెంచాలని కోరిందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొంతమంది సినీ ప్రముఖులు దీపికకు మద్దతు ఇస్తుంటే, మరికొందరు ఆమె నిర్ణయాన్ని విమర్శిస్తున్నారు. ఇప్పుడు స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఊపునిచ్చాయి. కాగా, 25 ఏళ్ళ క్రితం స్మృతి ఇరానీ నటించిన హిందీ సీరియల్ ‘క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ’ 2000 జులై నుండి 2008 నవంబరు వరకు విజయవంతంగా ప్రసారమైంది. ఇందులో తులసి పాత్రలో నటించి, ప్రేక్షకుల ఆదరణతోపాటు పలు అవార్డులు కూడా ఆమె దక్కించుకున్నారు.. దీని సీక్వెల్ ‘క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ 2’ జులై 29 నుంచి ప్రసారం అవుతోంది.