Deepika Padukone | బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొణే గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఓం శాంతి ఓం సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తన మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. బ్యాక్ టూ బ్యాక్ వరుస హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్న ఈ భామ తెగ వార్తలలో నిలుస్తుంది. ఆ మధ్య సందీప్ రెడ్డి వంగా, దీపికా మధ్య చిన్న పాటి కోల్డ్ వారే నడిచింది. స్పిరిట్ కోసం దీపికాని సందీప్ సంప్రదించగా, ఆమె పలు కారణాలతో తప్పుకుంది. అయితే అల్లు అర్జున్- అట్లీ సినిమాకి మాత్రం దీపికానే కథానాయికగా ఎంపికైంది.
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి దీపికా పదుకొణె అరుదైన గౌరవం పొందారు. ఆమెకు “హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ అవార్డు” లభించింది. మోషన్ పిక్చక్ క్యాటగిరీలో హాలీవుడ్ ఛాంబర్ దీపికాని ఎంపిక చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హాలీవుడ్ బులేవార్డ్పై ఆమె పేరుతో త్వరలోనే ఒక స్టార్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇది చాలా అరుదైన అవకాశం. ప్రపంచవ్యాప్తంగా సినీ, సంగీత, టెలివిజన్, థియేటర్ రంగాల్లో ఎంతో ప్రతిష్ఠతో నిలిచే ఈ వాక్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చేరడం ఒక గొప్ప గౌరవం. దీపికా ఈ గుర్తింపును పొందిన మొదటి జెనరేషన్ ఇండియన్ నటీమణుల్లో ఒకరిగా నిలిచారు.
దీపికా పదుకొణె ఇటీవల హాలీవుడ్ చిత్రాలు, అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్, మెటా గాలా వంటి ప్రముఖ ఈవెంట్లలో పాల్గొంటూ గ్లోబల్ ఆడియన్స్‌కి దగ్గరయ్యారు. ఆమె నటించిన హాలీవుడ్ మూవీ xXx: Return of Xander Cage ద్వారా అక్కడి ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఇప్పటి వరకు షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి పాపులర్ ఇండియన్ నటులు కూడా ఈ జాబితాలో చేరలేదు. దీపికా ఇప్పుడు ఆ ఘనత సాధించడం అత్యంత గర్వకారణం. వచ్చే సంవత్సరంలో (2026లో) దీపికా పేరుతో ఏర్పాటు చేయబోయే వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ ప్రత్యేక కార్యక్రమానికి హాలీవుడ్ ప్రముఖులు, పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రపంచ సినీ పరిశ్రమ నుంచి మరికొంత మంది ప్రముఖులు హాజరయ్యే అవకాశముంది.