Deepika Padukone | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ ఇటీవల ముంబై ఎయిర్‌పోర్టులో తన కుమార్తె దువాతో కనిపించారు. అయితే ఈ సందర్బంగా ఒక అభిమాని ప్రైవసీని ఉల్లంఘిస్తూ దువా ఫోటోలు తీశాడు. దీన్ని గమనించిన దీపిక, వెంటనే అతడిని మందలించి, ఫోటోలు-వీడియోలు డిలీట్ చేయాలని కోరారు. అయినప్పటికీ ఆ వ్యక్తి వినకుండా వాటిని నెట్టింట షేర్ చేయడంతో, దీపిక తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీపికా-రణవీర్ సింగ్ జంట 2018లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి 2024 సెప్టెంబరు 8న కుమార్తె జన్మించింది. ఆమెకు “దువా” అనే పేరు పెట్టారు.
పుట్టినప్పటి నుంచి దువా ముఖాన్ని బయటపెట్టకుండా, ప్రైవసీని కాపాడేందుకు ఈ దంపతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మీడియా వారికి కూడా ఇదే విజ్ఞప్తి చేశారు. అయితే తాజాగా ఒక వ్యక్తి సీక్రెట్‌గా దువా ఫోటోలు తీసి ఆన్లైన్లో షేర్ చేయడంతో దీపిక చాలా ఆవేదన చెందింది. ఫ్యాన్స్ కూడా దీపికకు మద్దతుగా నిలుస్తున్నారు. “పేరెంట్స్ అనుమతి లేకుండా చిన్నారి ఫోటో షేర్ చేయడం తప్పు” అంటూ సోషల్ మీడియాలో వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు బాలీవుడ్లో కొత్తేమి కావు. ఇటీవలే హీరోయిన్ ఆలియా భట్ కూడా తమ ఇంటి ఆవరణలోకి వచ్చిన ఫోటోగ్రాఫర్లపై అసహనం వ్యక్తం చేశారు. “ఇది మీ ఇల్లు కాదు… దయచేసి వెళ్లండి” అంటూ గట్టిగా స్పందించింది. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది.
సినిమాల విషయానికి వస్తే… ప్రస్తుతం దీపికా పదుకోన్ పలు భారీ సినిమాల్లో నటిస్తున్నారు. ప్రత్యేకంగా, అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీకి ఆమె ఎంపికైంది. ఈ చిత్రంలో ఆమె వారియర్ ప్రిన్సెస్ పాత్రలో కనిపించనున్నారు. ఇది ఆమె కెరీర్లో మరో ప్రధాన మైలురాయిగా మారనుందని టాక్. మరోవైపు ప్రభాస్ నటించనున్న కల్కి 2 చిత్రంలో కూడా దీపికా నటించనుంది.