ఆత్యాశకు పోయి బంగారంలాంటి అవకాశాన్ని చేతులారా జారవిడుచుకున్నదట బాలీవుడ్ భామ దీపిక పదుకోన్. ప్రస్తుతం బీటౌన్‌లో ఈ వార్త ఓ రేంజ్లో వైరల్ అవుతున్నది. వివరాల్లోకెళ్తే.. బిడ్డకు జన్మనివ్వడంవల్ల కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్న దీపికా.. తాజాగా ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాకు సైన్ చేసింది. ఈ సినిమాలో నటిస్తున్నందుకుగాను పారితోషికం కూడా భారీగానే అందుకుంటున్నదని గతంలోనే వార్తలొచ్చాయి. కథ, పాత్రల రీత్యా ప్రభాస్‌కి జోడీగా దీపిక అయితేనే బావుంటుందని భావించడంతో అడిగినంత పారితోషికం ఇచ్చేందుకు నిర్మాతలు కూడా అంగీకరించారు. ఈ సినిమా నిర్మాతల్లో దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా కూడా ఒకరన్న విషయం తెలిసిందే.
ఇక రేపో మాపో షూటింగ్ మొదలుపెడదాం అనుకుంటుంటే.. ఓవైపు దీపికా గొంతెమ్మ కోర్కెలు అంతకంతకూ ఎక్కువైపోతున్నాయట. ఆరు గంటలు మాత్రమే షూటింగ్లో ఉంటానని, పారితోషికంతోపాటు లాభాల్లో కూడా వాటా కావాలని, తన స్టాఫ్ శాలరీలు కూడా నిర్మాతలే భరించాలని ఇలా కోర్కెల చిట్టాను నిర్మాతల ముందు పెట్టేస్తున్నదట. దీంతో సందీప్‌రెడ్డి వంగా అసహనానికి లోనయ్యారని వినికిడి. మామూలుగానే సందీప్ ప్రాసెస్ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. ఏదైనా ముఖంమీదే చెప్పేసే తత్వం ఆయనది. డేరింగ్, డాషింగ్ డైరెక్టర్ అన్నమాట. దాంతో ఈ సినిమాలో దీపిక ప్లేస్ డేంజర్లో పడిందని టాక్. ఆమెను సినిమా నుంచి తప్పించాలని గట్టిగా డిసైడ్ అయ్యారట సందీప్‌రెడ్డి వంగా. మరి ఆ ప్లేస్‌లో ఎవరొస్తారో చూడాలి.