మేఘనా నాయుడు
దాసరి మేఘనా నాయుడు.. ఒక్కపాటతో సోషల్ మీడియాని షేక్చేసింది. ‘ఏదో అడగనా..’ అంటూ ఆమె పాడిన పాట తాను పోటీపడుతున్న షో జడ్జెస్ నుంచి మాత్రమే కాదు, వేరే పాటల కార్యక్రమాల న్యాయనిర్ణేతల నుంచీ ప్రశంసలందించింది. జీ తెలుగు సరిగమప సీజన్ 16 టైటిల్ కోసం పోటీ పడుతున్న మేఘన ఇప్పటికే కొన్ని సినిమాలు, ప్రైవేట్ ఆల్బమ్స్‌లో పాటలు కూడా పాడింది. గీత రచయితగా, మ్యూజిక్ కంపోజర్‌గానూ ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నానని చెబుతున్న ఈ హైదరాబాద్ అమ్మాయి ముచ్చట్లు..
నాకు చిన్నప్పటి నుంచే పాటలంటే చాలా ఇష్టం. అందుకే నాలుగేళ్ల వయస్సు నుంచే సంగీతం నేర్చుకున్నా. లైట్ మ్యూజిక్ కోసం రామాచారి గారి లిటిల్ మ్యూజిషియన్ అకాడమీలో చేరా. కర్ణాటక సంగీతం శ్రీనిధి మేడమ్ దగ్గర నేర్చుకున్నా. చిన్నప్పటినుంచే స్టేజ్ ఫెర్ఫామెన్స్ ఇచ్చేదాన్ని. ఆరో తరగతిలో ఉన్నప్పుడే మొదటిసారి పాటల పోటీలో పాల్గొన్నా. ‘బోల్ బేబీ బోల్’ షోతోపాటు, టీటీడీ నిర్వహించిన ‘అన్నమయ్య పాటకు పట్టాభిషేకం’ కార్య క్రమంలోనూ పాడాను. స్కూల్, కాలేజీ ఫంక్షన్లలోనూ పాటంటే నేనుంటా. చాలా ప్రైవేట్ ఆల్బమ్స్‌లోనూ పాడాను. అనురాగ్ కులకర్ణి గారితో ‘పటేల్‌సార్’ సినిమాలో పాడాను. ‘అలనాటి రామచంద్రుడు’లో కూడా పాడాను. చాలా సినిమాల్లో కోరస్, ట్రాక్.. రికార్డింగ్‌లోనూ గొంతు అందిస్తున్నా. గాయకులంటే అన్నిటికీ ప్రాధాన్యం ఇవ్వాలి. చదువు విషయానికి వస్తే ఇటీవలే డిగ్రీ కంప్లీట్ చేశా. ఇక, నేను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగా. కాబట్టి పక్కా హైదరాబాద్ అమ్మాయినన్న మాట!
పాటలు రాస్తా…
లైవ్ ఫెర్ఫామర్, ప్లేబ్యాక్ సింగర్‌గా రాణిస్తూ.. సంగీతాన్నే కెరీర్‌గా చేసుకోవాలనుకుంటున్నా. నా పాటలు నేను రాసుకుని, కంపోజ్ చేసి ఆల్బమ్స్ చేయాలని ఉంది. డాడీ రిటైర్ అయ్యారు. అమ్మ నేను పుట్టినప్పుడే జాబ్ మానేశారు. ఇంట్లో పూర్తి మద్దతు ఉంటుంది. జాబ్ చెయ్యి అని ఫోర్స్ చేయరు. నాకు ఇష్టమైన కెరీర్‌ని ఎంచుకునేందుకు ప్రోత్సహిస్తున్నారు. నా విషయంలో మా కుటుంబం చాలా సంతోషంగా ఉంది. బంధువులు, స్నేహితులు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరింత పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఖాళీ సమయాల్లో పాటలు రాసుకుని, కంపోజ్చేసి పాడుకుంటూ ఉంటాను. చిన్నప్పుడు టీవీల్లో పిల్లల ప్రోగ్రామ్స్ యాంకరింగ్ కూడా చేశాను. కానీ వాటి మీద ఫోకస్ చేస్తే సంగీతంపై ఏకాగ్రత తగ్గుతుందని మానేశా. ఏఆర్ రెహమాన్, ఇళయరాజా వంటి సంగీత దర్శకులతో కలిసి పనిచేయాలనుంది. వాళ్ల సినిమాల్లో ఒక్క పాటైనా పాడే అవకాశం రావాలని కోరుకుంటున్నా.
కోటిగారు స్పెషల్
కోటిగారు చేసిన సినిమాలు చాలా ప్రత్యేకమైనవి. ఆయన అన్ని రకాల జానర్ సినిమాలు, క్లాసికల్స్, ఫాస్ట్ బీట్స్, మెలొడీస్ చేశారు. అన్ని సంగీత వాయిద్యాలు వాయిస్తారు. అలాంటి వ్యక్తి అందరితోనూ కలిసిపోవడం, సలహాలు, సూచనలు చెప్పడం చాలా గొప్ప విషయం. మోహన్ అన్నకి రూ.5 లక్షలు చెక్ ఇవ్వడం చూసి షాకయ్యా. ఎదుటివాళ్లు కూడా ఎదగాలి అనుకోవడం, కష్టాల్లో ఉన్నారంటే ఆయన వల్ల అయిన సాయం చేయడం నిజంగా ఆయన గొప్పలక్షణాలు. ఎస్పీ శైలజ మేడమ్, కాసర్ల శ్యామ్ గారు కూడా చాలా బాగా గైడ్ చేస్తారు.
ఆడిషన్స్ ఇస్తాననుకోలేదు
చిన్నప్పటి నుంచి పాడుతూనే ఉన్నా కూడా ‘జీ తెలుగు’ వల్ల మంచి గుర్తింపు వచ్చింది. సోషల్ మీడియాలో నా పాటకు వచ్చిన స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నిజానికి సరిగమప 16 ఆడిషన్స్ సమయంలో ఒంట్లో బాలేదు. ఆడిషన్స్ ఇవ్వలేననుకున్నా. ఏదైతే అదవుతుంది, నువ్వు ఆడిషన్ ఇవ్వు… అని దగ్గరి వాళ్లు ప్రోత్సహించడంతో వెళ్లా. సెలెక్ట్ అయ్యా. మొదటి ఎపిసోడ్ నుంచీ నా ఫెర్ఫామెన్స్కి జడ్జెస్ ఇచ్చే రెస్పాన్స్ చాలా ప్రోత్సాహంగా ఉంటున్నది. ‘ఏదో అడగనా..’ పాట నా లైఫ్‌లో చాలా పేరుతెచ్చింది. నా పేరున ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చూసి షాకయ్యా. చంద్రబోస్ గారి లాంటి పెద్దవాళ్లు గుర్తించడం చాలా ఆనందంగా అనిపించింది. అది మాత్రం అస్సలు ఊహించలేదు.