తారాగణం: నాని, కీర్తి సురేష్, దీక్షిత్‌శెట్టి, సముద్రఖని, సాయికుమార్, జరీనా వహాబ్, షైన్ టామ్ చాకో తదితరులు
సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్
సంగీతం: సంతోష్ నారాయణన్
నిర్మాణ సంస్థ: శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
రచన-దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల
కథాంశాల ఎంపికలో కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తారు హీరో నాని (Nani). పాత్రలపరంగా కూడా తనని తాను నవ్యరీతిలో ఆవిష్కరించుకోవాలని తపిస్తారు. నాని (Nani) నటించిన పక్కా మాస్ చిత్రం ‘దసరా’ (Dasara). తెలంగాణ సింగరేణి నేపథ్య ఇతివృత్తంతో రూపొందిన ఈ సినిమా నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నది. ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. నాని (Nani) నటించిన తొలి పాన్ ఇండియా చిత్రమిదే కావడం కూడా అంచనాల్ని పెంచింది. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘దసరా’ (Dasara) ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం..
Dasara
సింగరేణి దగ్గరలోని వీర్లపల్లి అనే గ్రామంలో 90వ దశకం నేపథ్యం జరిగే కథ ఇది. ధరణి (నాని), సూరి (దీక్షిత్ శెట్టి) బాల్యం నుంచే ప్రాణస్నేహితులు. పాఠశాల రోజుల్లోనే వెన్నెలను (కీర్తి సురేష్) ఎంతగానో ఇష్టపడతాడు ధరణి. అయితే సూరి కూడా వెన్నెలనే ఇష్టపడుతున్నాడని తెలుసుకొని స్నేహం కోసం తన ప్రేమను త్యాగం చేస్తాడు. ఓపెన్‌కాస్ట్‌కు ఆనుకోని ఉండే వీర్లపల్లి రాజకీయాల్ని శివన్న (సముద్రఖని), అతని తనయుడు చిన నంబయ్య (టామ్ చాకో) శాసిస్తుంటారు. ఊరి సర్పంచ్ ఎన్నికల్లో ధరణి, సూరితో పాటు అతని మిత్ర బృందం శివన్న ప్రత్యర్థి అయిన రాజన్న (సాయికుమార్)కు మద్దతుగా నిలుస్తారు. ఈ నేపథ్యంలో వీర్లపల్లిలో రాజకీయ కక్షలు చెలరేగుతాయి. సూరి హత్యకు గురవుతాడు. అసలు సూరిని చంపింది ఎవరు? అందుకు దారితీసిన పరిస్థితులేమిటి? చిన్ననాటి స్నేహితులైన ధరణి, సూరి, వెన్నెల జీవితాలు అనూహ్య మలుపుల నడుమ ఏ తీరాలకు చేరాయన్నదే మిగతా చిత్ర కథ..
Dasara
ప్రతీకార నేపథ్య కథల్లో ఎమోషన్‌తో పాటు కావాల్సినంత డ్రామా పండించే వీలుంటుంది. అందుకే రివేంజ్ ఫార్ములా ఎప్పుడూ ప్రేక్షకుల్ని మెప్పిస్తూనే ఉంటుంది. ‘దసరా’ కూడా ఓవరాల్‌గా రివేంజ్ డ్రామానే. అయితే దానికి సింగరేణి ఓపెన్ కాస్ట్ నేపథ్యం కొత్తదనాన్ని తీసుకొచ్చింది. రస్టిక్ బ్యాక్‌గ్రౌండ్‌లో అక్కడి కార్మికుల జీవితాల్ని సహజసిద్ధంగా ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. వాస్తవికత, సహజత్వం కలబోసిన ఈ కథలో అంతర్లీనంగా స్నేహం, ప్రేమ, పెళ్లి, ఊరి ఆధిపత్య రాజకీయాలు, రావణాసురుడి నైజం కలిగిన ప్రతినాయకుడి అంశాల్ని కలబోసి సినిమాను ఆద్యంతం ఎమోషనల్ డ్రైవ్‌తో తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. సినిమా ఆరంభం కాస్త స్లోపేస్లో అనిపించినా…నాని ఎంట్రీతో కథ ఊపందుకుంటుంది. బొగ్గు దొంగతనం ఎపిసోడ్‌ను ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేశారు.
ప్రథమార్థం మొత్తం ధరణి, సూరి మధ్య స్నేహం, ఊరి రాజకీయాల మీదే నడిపించారు. సిల్క్ బార్ మీద ఆధిపత్యం సంపాదించడానికి శివన్న, రాజన్న వేసే ఎత్తులు..క్రికెట్ పోటీలో నెగ్గిన వారికి సిల్క్బార్ కౌంటర్ బాధ్యతలు అప్పగించే సన్నివేశాలు ఆసక్తిని పంచుతాయి. వెన్నెల పెళ్లి నుంచి కథ కీలకమైన మలుపు తీసుకుంటుంది. ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. అయితే ఫస్టాఫ్‌లో సిల్క్బార్, ఊరి ఆధిపత్య రాజకీయాల మీదనే ఎక్కువగా కథ నడిపించారు. ఈ క్రమంలో ధరణి, సూరి పాత్రల మధ్య అనుబంధాన్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదనే భావన కలుగుతుంది.
ఇక సెకండాఫ్‌లో ఎమోషనల్ డ్రామాను పండించే ప్రయత్నం చేశారు. వెన్నెలను విధవరాలిగా చూడలేక ధరణి ఆమెకు తాళికట్టి ఓ స్నేహితుడిలా రక్షణగా నిలుస్తానని చెప్పే ఎపిసోడ్ భావోద్వేగాల్ని పంచుతుంది. అయితే ద్వితీయార్థంలో కథ, కథనాలు మొత్తం ప్రేక్షకుల ఊహకు తగినట్లుగానే సాగుతాయి. కథాపరంగా కొన్ని లోపాలున్నా సింగరేణి బ్యాక్‌డ్రాప్ ఈ కథకు ఆయువు పట్టులా నిలిచింది. డైరెక్ట్ శ్రీకాంత్ ఓదెల అగ్ర దర్శకుడు సుకుమార్ శిష్యుడు కావడం వల్ల ఈ సినిమాలో అక్కడక్కడా ‘రంగస్థలం’ ఛాయలు కనిపిస్తాయి. ైక్లెమాక్స్ ఎపిసోడ్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారు. నాని హీరోయిజాన్ని పతాక స్థాయిలో ఆవిష్కరిస్తూ రొమాంచితమైన యాక్షన్ సీన్స్‌తో డిజైన్ చేశారు. ఓరకంగా ఈ సినిమా ముక్కోణపు ప్రేమకథలా అనిపిస్తుంది. దానికి వీర్లపల్లి అనే రస్టిక్ విలేజ్ బ్యాక్‌డ్రాప్, రాజకీయాలను మేళవించి ఎమోషనల్ మాస్ ఎంటర్టైనర్గా ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. సింగరేణి నేపథ్యంలో కథను వాస్తవికతను దగ్గరగా చూపించే ప్రయత్నం చేసినా…సినిమాలో ఏదో ఎమోషన్ మిస్సయిందనే ఫీల్ కలుగుతుంది.
Dasara
ధరణి పాత్రలో నాని జీవించాడు. నిస్సందేహంగా ఇది నాని (Nani) కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్గా అభివర్ణించవొచ్చు. తన పాత్రకోసం ఎంత నిజాయితీగా పనిచేశాడో, లుక్స్‌పరంగా ఏ స్థాయిలో శ్రద్ధ తీసుకున్నాడో ప్రతీ ఫ్రేములో కనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్‌లో నాని పతాక స్థాయిలో నటనను కనబరిచాడు. ధరణి స్నేహితుడు సూరి పాత్రలో కన్నడు నటుడు దీక్షిత్ శెట్టి మెప్పిస్తాడు. వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) ఒదిగిపోయింది. తెలంగాణ పల్లెటూరి అమ్మాయిగా తనదైన అద్భుతాభినయంతో ఆకట్టుకుంది. ‘మహానటి’ తర్వాత ఆమెకిది బెస్ట్ రోల్ అని చెప్పొచ్చు. మలయాళ నటుడు షైన్ టామ్ చాకో సైలెంట్‌గా ఉంటూనే భయపెట్టాడు. సాయికుమార్, జరీనా వహాబ్, ఝాన్సీ తమ పాత్రల పరిధుల మేరకు చక్కటి నటనను కనబరిచారు. సముద్రఖని పాత్రకు సరైన ప్రాధాన్యత దక్కలేదనిపించింది.
సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. వీర్లపల్లి విలేజ్ సెట్ సహజంగా అనిపించింది. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ ఈ కథకు ప్రధానాకర్షణగా నిలిచింది. సింగరేణి నేపథ్యాన్ని ఆయన అత్యంత సహజంగా తెరపైకి తీసుకొచ్చారు. ఇక సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా నిలిచింది. ‘చమ్కీల అంగీలేసి’ పాట చాలా పాపులర్ అయినప్పటికీ చిత్రీకరణ పరంగా గొప్పగా లేదనిపిస్తుంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తొలి చిత్రంతోనే సత్తా చాటాడు. కథలోని సంఘర్షణ, డ్రామాను సహజంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. ఇక నిర్మాణపరంగా ఎక్కడా ఎలాంటి లోపాలు కనిపించలేదు. భారీ వ్యయంతో అన్కాంప్రమైజ్డ్గా తెరకెక్కించారు.
Dasara
నాని, కీర్తి సురేష్ (Keerthy Suresh) నటన, పాటలు, సింగరేణి నేపథ్యం, ైక్లెమాక్స్ ఎపిసోడ్
మైనస్ పాయింట్స్: కథ కొన్ని చోట్ల సాగతీతగా అనిపించడం, బలమైన ఎమోషన్స్ లేకపోవడం
రేటింగ్: 2.75/5