Hero Nani | నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ‘దసరా’ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. నానికి మాస్ ఇమేజ్ను తీసుకొచ్చింది. వందకోట్ల వసూళ్లతో రికార్డు సృష్టించింది. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ కాంబినేషన్ మరోమారు రిపీట్ కానుంది. నాని-శ్రీకాంత్ ఓదెల రెండో చిత్రాన్ని శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా అనౌన్స్మెంట్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఎరుపురంగులో పెయింట్ చేయబడ్డ ఈ పోస్టర్ వయొలెన్స్‌ను సూచిస్తున్నది. గడ్డం పెంచి మెలి తిప్పిన మీసాలతో నాని మాస్ అవతారంలో కనిపిస్తున్నారు. ‘యూ డోంట్ నీడ్ ఆన్ ఐడెంటిటీ టు బీ ఏ లీడర్’ అని పోస్టర్‌పై రాసిన క్యాప్షన్ సినిమా కాన్సెప్ట్‌ను తెలిపేలా ఉంది. ‘ఈ చిత్రంలో నాని పవర్ఫుల్ మాస్ పాత్రలో కనిపిస్తారు. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం. 2025 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’ అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి నిర్మాత: సుధాకర్ చెరుకూరి, రచన-దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల.