అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ అగ్ర హీరో దర్శన్ బెంగళూరు పరప్పన అగ్రహారం జైల్లో శిక్షననుభవిస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్లో కర్ణాటక హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయగా, దానిని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో విచారణలో భాగంగా ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరయ్యారు దర్శన్.
అగ్రహారం జైల్లో పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయని, తాను అక్కడ ఉండలేకపోతున్నానని న్యాయమూర్తి ముందు మొరపెట్టుకున్నారట దర్శన్. తాను సూర్యరశ్మిని చూసి చాలా రోజులైందని, గదిలో దుర్వాసన వస్తున్నదని, ఇలాంటి పరిస్థితుల్లో తాను బతకలేనని, విషమిచ్చి చంపేయండని దర్శన్ న్యాయమూర్తిని వేడుకున్నారని తెలిసింది.
హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను కొట్టివేసిన సుప్రీం ధర్మాసనం దర్శన్‌ను వెంటనే కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది. అంతేకాకుండా ఆయన్ని సాధారణ ఖైదీలాగే చూడాలని, ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించొద్దని అధికారులకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో దర్శన్ జైల్లో పరిస్థితులపై న్యాయమూర్తి ముందు కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం.