Fauzi | తెలుగు సినీ పరిశ్రమలో ఘట్టమనేని కుటుంబం ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని మహేష్ బాబు మరింత ఎత్తుకు చేర్చగా, ఇప్పుడు ఆయన తర్వాతి తరం సినీ రంగంలో అడుగుపెడుతోంది. ఇప్పటికే మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ‘1 నేనొక్కడినే’లో నటించి ప్రేక్షకులను పలకరించగా, మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక కృష్ణ మూడో అల్లుడు సుధీర్ బాబు పెద్ద కుమారుడు చరిత్ మానస్ చైల్డ్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో కనిపించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు సుధీర్ బాబు చిన్న కుమారుడు దర్శన్ సినీ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నాడు.
తాజా సమాచారం ప్రకారం, దర్శన్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ లో కీలక పాత్రలో నటించనున్నాడు. ప్రభాస్ చిన్న వయస్సు పాత్రలో దర్శన్ కనిపించనున్నట్లు టాక్. లుక్ టెస్ట్ పూర్తయ్యిందని, దర్శన్ నటనతో యూనిట్ ఫిదా అయిందని సమాచారం. ‘ఫౌజీ’లో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద వంటి ప్రముఖ నటులు ఉన్న నేపథ్యంలో ఘట్టమనేని వారసుడికి ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో అవకాశం దక్కడం పెద్ద అచీవ్‌మెంట్‌గా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ పాన్ఇండియా ఇమేజ్ దృష్ట్యా ఈ సినిమా దర్శన్‌కు పవర్ఫుల్ లాంచ్‌ప్యాడ్‌గా నిలవనుందని అంచనా.
ఇక మరోవైపు, మహేష్ బాబు నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘గుఢాచారి 2’ లో కూడా దర్శన్ కీలక పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రానున్నప్పటికీ, ఘట్టమనేని అభిమానులు ఆ అప్డేట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సుధీర్ బాబు ‘జటాధర’ అనే యాక్షన్ థ్రిల్లర్‌తో బిజీగా ఉన్నారు. నవంబర్ 7న విడుదల కాబోయే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఆయన పెద్ద కుమారుడు చరిత్ మానస్ సోషల్ మీడియాలో “జూనియర్ మహేష్”గా పాపులర్ అవుతుండగా, చిన్న కుమారుడు దర్శన్ ఇప్పుడు “జూనియర్ ప్రభాస్”గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్త ఘట్టమనేని అభిమానుల్లో ఉత్సాహాన్ని రేపుతోంది. ఒకే కుటుంబం నుంచి వరుసగా కొత్త తరం నటులు సినీ రంగంలోకి వస్తుండటంపై అభిమానులు గర్వంగా స్పందిస్తున్నారు. కృష్ణ గారి వారసత్వాన్ని కొనసాగించే కొత్త తరానికి ఇది శుభారంభమని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.