NTR | టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆడియో క్లిప్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఆడియోలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మాట్లాడిన మాటలు అందరు షాక్ అయ్యేలా చేశాయి. ఈ ఆడియోలో ‘వార్ 2’ స్పెషల్ షోకు అనుమతి అడిగిన అభిమానిపై దుర్భాషలాడుతూ, జూనియర్ ఎన్టీఆర్ సినిమాల ప్రదర్శనను అడ్డుకుంటానంటూ ఎంఎల్ఏ హెచ్చరిస్తారు. తీవ్ర స్థాయిలో అసభ్య పదజాలంతో మాట్లాడిన వ్యక్తి అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అని నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో అనంతపురం అర్బన్ టీడీపీ ఎంఎల్ఏ దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయాన్ని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ముట్టడించారు.
అర్బన్ టీడీపీ కార్యాలయం ముందు బైఠాయించిన జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్.. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు.. దగ్గుపాటి బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. పరిస్థితి చేజారుతుండటంతో అభిమానులను పోలీసులు అడ్డుకున్నారు.ఈ నేపథ్యంలో ఆ వీడియో తనది కాదని ఖండించారు దగ్గుపాటి ప్రసాద్. ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు, ఆడియో తనది కాకపోయినా క్షమాపణలు చెబుతున్నాను అని స్పష్టం చేశారు. ఇది పూర్తిగా రాజకీయ కుట్ర అని, తనపై అసత్య ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు.
తాను జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ అభిమానినని, వారి కుటుంబాన్ని గౌరవిస్తానని తెలిపారు. తన పేరు, ప్రతిష్టను కించపరచడానికి కావాలనే ఇలా ఫేక్ ఆడియో వైరల్ చేస్తున్నారని ఆరోపించారు. మరి టీడీపీ ఎమ్మెల్యే వివరణ ఇచ్చిన తర్వాత అయిన ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహం చల్లారుతుందా లేదా అనేది చూడాలి.