Betting App Case | ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా నేడు అక్రమ బెట్టింగ్ యాప్ల కేసు విచారణ నిమిత్తం సిట్ (SIT – ప్రత్యేక దర్యాప్తు బృందం) ముందు హాజరుకానున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ బెట్టింగ్ యాప్ల వ్యవహారంలో పలువురు సినీ ప్రముఖులకు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి సమాచారం తెలుసుకునేందుకు సిట్ అధికారులు గతంలో రానాకు నోటీసులు జారీ చేశారు.
సిట్ కార్యాలయంలో ఈరోజు రానాను అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ బెట్టింగ్ యాప్ల ప్రచారం (Promotion)లో రానా పాత్ర ఏమైనా ఉందా, లేదా ఈ యాప్ల నిర్వాహకులతో ఆయనకు ఏమైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా అనే కోణంలో అధికారులు విచారణ జరపనున్నారు. రానా విచారణ అనంతరం ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇంతకుముందే ఈ కేసులో నటులు విజయ్ దేవరకొండతో పాటు ప్రకాశ్ రాజ్ని సిట్ విచారించింది.