Dacoit | టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘డెకాయిట్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. షనీల్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రివెంజ్ డ్రామా, రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మేళవింపుగా రూపొందుతోంది. కథ, ట్రీట్మెంట్ పరంగా కొత్తదనం చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు చిత్ర బృందం చెబుతోంది.ఈ చిత్రంలో శేష్‌కు జోడీగా మృణాల్ ఠాకూర్ నటించడం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై మంచి బజ్‌ను సృష్టించాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 10, 2026న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
ఇక తాజాగా సినిమా ప్రమోషన్లలో భాగంగా అడివి శేష్ అభిమానులతో సోషల్ మీడియా ద్వారా ముచ్చటిస్తూ కీలక ప్రకటన చేశాడు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ‘డెకాయిట్’ ట్రైలర్‌ను ఏప్రిల్ 4న విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. ఈ ట్రైలర్‌తో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరుగుతాయని మేకర్స్ ధీమాగా ఉన్నారు.ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుండగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భారీ నిర్మాణ విలువలతో ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్, బాలీవుడ్ దర్శకుడు-నటుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల్లో కనిపించనుండటం విశేషం. వారి పాత్రలు కథకు బలాన్ని అందించనున్నాయని టాక్ వినిపిస్తోంది. సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందిస్తుండగా, టెక్నికల్‌గా కూడా సినిమా ఉన్నత స్థాయిలో ఉండబోతోందని చిత్ర యూనిట్ చెబుతోంది. అడివి శేష్ తన కెరీర్లో ఎప్పుడూ కంటెంట్ ఆధారిత సినిమాలతోనే గుర్తింపు పొందాడు. ఇప్పుడు ‘డెకాయిట్’తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటాడా అన్న ఆసక్తి నెలకొంది. మొత్తానికి ట్రైలర్ రిలీజ్‌తో ‘డెకాయిట్’పై ఉన్న హైప్ మరింత పెరగడం ఖాయం. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.