Dacoit | టాలీవుడ్ హీరో అడివి శేష్ నటించిన తాజా చిత్రం డెకాయిట్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. విడుదలైన మొదటి రోజునుంచే మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, రెండు రోజుల్లోనే భారీ వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఈ చిత్రం అడివి శేష్ కెరీర్లోనే అత్యుత్తమ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలవడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా తొలి రెండు రోజుల్లోనే సుమారు రూ.28 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. మొదటి రోజు రూ.15 కోట్లు, రెండో రోజు రూ.13 కోట్లు రాబట్టడం ద్వారా ఈ సినిమా మంచి కలెక్షన్లను కొనసాగిస్తోంది. ఇక హిందీ వెర్షన్ కూడా ఆశించిన దానికంటే మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. మొదటి రోజు రూ.1.3 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం, రెండో రోజు రూ.1.75 కోట్లకు పెరగడం గమనార్హం.
సాధారణంగా రెండో రోజు డ్రాప్ కనిపించే సందర్భాల్లో, ఈ సినిమా మాత్రం గ్రోత్ నమోదు చేయడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అంతేకాదు, విదేశాల్లో కూడా ‘డెకాయిట్’ మంచి రన్ కొనసాగిస్తోంది. ముఖ్యంగా అమెరికా మార్కెట్లో బలమైన వసూళ్లు సాధిస్తూ, ఇప్పటికే $1 మిలియన్ మార్క్‌ను దాటడం చిత్ర బృందానికి పెద్ద ప్లస్‌గా మారింది. ఎమోషనల్ ఫీల్ గుడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ఇద్దరి నటన కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా శేష్ తన పాత్రలో చూపిన ఇంటెన్సిటీ, భావోద్వేగాలు సినిమాకు ప్రధాన బలం అయ్యాయి.
సినిమా టేకింగ్, మేకింగ్ విలువలు, కథనం అన్నీ కలిసి ఈ చిత్రాన్ని మరింత బలంగా నిలబెట్టాయి. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ నిర్మించారు. మంచి కంటెంట్‌తో పాటు బలమైన ప్రెజెంటేషన్‌తో వచ్చిన ‘డెకాయిట్’ సినిమా బాక్సాఫీస్ వద్ద మరో హిట్‌గా నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాకి పోటీగా శర్వానంద్ బైకర్ చిత్రం కూడా విడుదల కాగా, ఈ మూవీ కూడా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.