‘క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ జీవితం నిజంగా స్పూర్తిదాయకం. ఇది డాక్యుమెంటరీ కాదు. పూర్తిస్థాయి కమర్షియల్ సినిమా. అసలు మురళీధరన్ జీవితంలో కమర్షియల్ అంశాలకు కొదవలేదు. ఆయన జీవితంలో ఇన్ని మలుపులున్నాయా? ఇన్ని కుదుపులున్నాయా? అని మీరే అశ్చర్యపోతారు’ అన్నారు శివలెంక కృష్ణప్రసాద్. లెజెండరీ క్రీడాకారుడు, శ్రీలంకన్ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన బయోపిక్ ‘800’. ఎం.ఎస్ శ్రీపతి దర్శకుడు. ముత్తయ్యగా ‘స్లమ్గాడ్ మిలియనీర్’ ఫేం మధుర్ మిట్టల్, ఆయన భార్య మదిమలార్గా మహిమా నంబియార్ నటించారు.
ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పిస్తున్న ఈ చిత్రం ఈనెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత శివలెంక విలేకరులతో ముచ్చటించారు. ‘శ్రీపతిని నేను దర్శకుడ్ని చేయాలనుకునేలోపు తనకు ఈ అవకాశం వచ్చింది. మంచి అవకాశం అవ్వడంతో ఒప్పుకున్నాను. చాలా బాగాతీశాడు. సినిమా పూర్తయ్యాక నాకు ఫోన్ చేసి ‘సినిమాను మీరే టేకోవర్ చేస్తే బావుంటుంది’ అని అడిగాడు. ఈ సినిమా నిర్మాతను నేను కాపోయినా శ్రీపతి వల్ల ఈ సినిమా గురించి తెలుసుకుంటూనే వున్నాను. చివరకు మురళీధరన్ కూడా ఫోన్ చేసి చెప్పడంతో కాదన్లేకపోయాను’ అని చెప్పారు శివలెంక. ఇంకా చెబుతూ ‘మొదట ఈ పాత్రకు విజయ్‌సేతుపతి అనుకున్నాం. కుదర్లేదు. తర్వాత నాని అనుకున్నాం కుదర్లేదు. చివరకు మధుర్ మిట్టల్ హీరో అయ్యాడు. ఈ సినిమా వల్ల సచిన్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే లాంటి క్రికెట్ దిగ్గజాలను కలిసినందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది’ అని శివలెంక కృష్ణప్రసాద్ నమ్మకం వ్యక్తంచేశారు.