NTR | నందమూరి అభిమానులకు ఈ సారి మే 20 నిజంగా పండగరోజుగా మారబోతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్లో మునుపెన్నడూ లేని విధంగా భారీ అప్డేట్స్ను విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఒక్క సినిమా కాదు, ఏకంగా నాలుగు ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లకు సంబంధించిన ప్రకటనలు రావొచ్చని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మొదటిగా అందరి దృష్టి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై ఉంది. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే పవర్ఫుల్ టైటిల్ ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి భారీ విజయాల తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్‌ను ఎలా చూపిస్తారో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్‌ను బర్త్‌డే రోజున విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఇక దేవర సినిమాకు సీక్వెల్‌గా రాబోతున్న ‘దేవర 2’పై కూడా క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దర్శకుడు కొరటాల శివ ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేశారని సమాచారం. అయితే షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎన్టీఆర్ షెడ్యూల్ ఎలా ఉండబోతుంది అనే విషయాలపై బర్త్‌డే రోజున అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఎన్టీఆర్ కాంబినేషన్ కూడా మరోసారి వార్తల్లో నిలుస్తోంది. ‘అరవింద సమేత’ తర్వాత ఈ కాంబోలో రాబోయే చిత్రానికి ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారని, ఈ సినిమాపై కూడా మే 20న అప్డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
ఇక కోలీవుడ్ స్టార్ దర్శకుడు వెట్రిమారన్‌తో ఎన్టీఆర్ సినిమా గురించి కూడా గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కే ఈ ప్రాజెక్ట్‌ను కూడా ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా అధికారికంగా ప్రకటించే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే, ఈసారి ఎన్టీఆర్ పుట్టినరోజు నందమూరి అభిమానులకు మరిచిపోలేని రోజుగా నిలవనుంది. నాలుగు భారీ ప్రాజెక్ట్‌ల అప్డేట్స్ ఒకేసారి రావడం అంటే సాధారణ విషయం కాదు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ వార్తలపై ట్రెండింగ్ మొదలైపోయింది. ఇక మే 20న విడుదలయ్యే ఈ గిఫ్ట్స్‌తో ఎన్టీఆర్ బాక్సాఫీస్ వద్ద మరోసారి సంచలనం సృష్టించడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.