నాని నిర్మించిన సినిమా కోర్ట్. ”ఈ సినిమా నచ్చకపొతే తన హిట్3 చూడకండి’ అంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చారు నాని. నిజంగా ఇది బోల్డ్ స్టేట్మెంట్. మరి ఈ సినిమా పై నాని నమ్మకం నిజమైయిందా? ఈ కోర్ట్ రూమ్ డ్రామాలో కొత్తదనం ఏమిటి? పోక్సో చట్టం ఇతివృత్తం ప్రేక్షకులు ఎలాంటి అనుభూతిని పంచిందో రివ్యూలో చూద్దాం.
కథ: 2013 నేపథ్యంలో విశాఖ పరిసర ప్రాంతాల్లో జరిగే కథ ఇది. చందు (రోషన్) ఏవో పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తూ పైస్థాయికి రావాలని కలలు కంటాడు. వాచ్‌మెన్‌గా పనిచేసే చందుకీ ఇంటర్మీడియట్ చదువుతున్న జాబిలి (శ్రీదేవి)కీ మధ్య ప్రేమ చిగురిస్తుంది. జాబిల్లి పెద్దింటి అమ్మాయి. వీరి ప్రేమ విషయం జాబిలి ఇంట్లో తెలిసిపోతుంది. జాబిలి మేనమామ మంగపతి (శివాజీ) పరువు కోసం బ్రతికే మనిషి. తనకున్న పలుకుబడితో పోక్సో చట్టంతోపాటు, మరికొన్ని కఠినమైన సెక్షన్ల కింద చందుపై కేసు పెడతాడు. 78 రోజుల పాట బెయిల్ లేకుండా రిమాండ్ లోనే ఉండిపోతాడు చందూ. న్యాయస్థానం కూడా చందూని దోషి అని నిర్దారించి తుది తీర్పుకు సిద్ధం అవుతుంది. ఇలాంటి దశలోనే చందూ కేసు వాదించడానికి ముందుకొస్తాడు జూనియర్ లాయర్ సూర్య తేజ (ప్రియదర్శి). తర్వాత ఏం జరిగింది? ఈ కేసుల నుంచి చందూ బయటపడ్డాడా? ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? అనేది మిగతా కథ.
విశ్లేషణ: చట్టాలు, అందులోని సెక్షన్ల ఆధారంగా న్యాయవ్యవస్థ నేపధ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. ‘కోర్ట్’ సినిమా పోక్సో యాక్ట్ ఇతివృత్తంతో నడిచే కథ. మైనర్ బాలికలపై జరుగుతున్న అత్యాచారాన్ని దృష్టిలో ఉంచుకొని, తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించేలా ఈ యాక్ట్ ని రూపొందించారు. కానీ కొంతమంది ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న తీరుని ఓ ప్రేమకథతో ముడిపెట్టి కోర్ట్ రూమ్ డ్రామాగా చూపించడం ఆకట్టుకునేలా వుంది. ఎక్కువ సమయం తీసుకోకుండానే నేరుగా కథలోకి వెళ్ళాడు దర్శకుడు. చందు కేసు సూర్యతేజ వద్దకు వెళ్ళడం అక్కడ నుంచి ఫ్లాష్ బ్యాక్ మొదలుకావడం, చందు జాబిల్లి ప్రేమకథలో అమాయకత్వం.. ఇవన్నీ కూడా డీసెంట్ డ్రామాని బిల్డప్ చేస్తాయి. మంగపతి క్యారెక్టర్ ప్రవేశంతో కథలో ఒక్కసారి అలజడి రేగుతోంది. ఆ పాత్రని తీర్చిదిద్దిన తీరు, ప్రేమకథకి ఆ పాత్ర అడ్డుపడిన విధానం సినిమాపై ఆసక్తిపెరిగేలా చేస్తుంది.
విరామ సన్నివేశాలని రసవత్తరంగా తీర్చిదిద్దాడు దర్శకుడు. ప్రియదర్శి కేసుని టేకప్ చేయడం, వాదనలు వినిపించడం, ముఖ్యంగా కళ్యాణ మండపం సీన్ ని రివిల్ చేసిన విదానంలో మంచి స్క్రీన్ ప్లే ట్రీట్మెంట్ కనిపిస్తుంది. అయితే ఒక దశలో కోర్ట్ వాదనల్లో బలం తగ్గిన ఫీలింగ్ కలుగుతుంది. నేచురల్ గా సాగాల్సిన డ్రామాకి కమర్షియల్ టచ్ ఇచ్చారనే భావన వస్తుంది. ఇదొక్క పాయింట్ తప్పితే కోర్ట్ అన్ని విధాలుగా ఓ మంచి సందేశం, ఆలోచన రేకెత్తించే సినిమాలా వుంటుంది.
నటీనటులు గురించి: చందు, జాబిల్లి పాత్రలకు న్యాయం చేశారు రోషన్ శ్రీదేవి, వారి అమాయకత్వం ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. ఆ పాత్రల్లో సహజంగా ఒదిగిపోయారు. ప్రియదర్శి నటన మరో ఆకర్షణ. ఆ పాత్రకు ఆయన పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యారు. శివాజీ మంగపతి క్యారెక్టర్ గుర్తుండిపోతుంది. ఆయన పండించిన విలనిజం ఫ్రెష్ గా వుంటుంది. సాయికుమార్ హర్షవర్ధన్ రోహిణి వీళ్ళంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.
చిన్న సినిమా అయినప్పటికీ ప్రొడక్షన్ లో ఎక్కడా రాజీపడలేదు. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ ఈ డ్రామాకు పర్ఫెక్ట్ గా సింక్ అయ్యింది. దినేష్ కెమరాపనితనం మరో ఆకర్షణ. ‘పిల్లలకు పాఠాలు నేర్పకపోయినా పర్వాలేదు, చట్టాలు మాత్రం నేర్పండి. తప్పు చేస్తే శిక్షించడం కాదు, అసలు ఏది తప్పో… చెప్పండి’ ఇలాంటి సహజమైన మాటలతో కథని మరింత లోతుగా కనెక్ట్ అయ్యేలా డైలాగులు రాశారు. ఒక చట్టం గురించి అవగాహన కలిపిస్తూనే ఓ మంచి కోర్ట్ రూమ్ డ్రామాగా ప్రేక్షకులని అలరించే సినిమా ఇది.
ప్లస్ పాయింట్స్
పోక్సో చట్టం ఇతివృత్తం
ప్రేమకథ
నటీనటులు
మైనస్ పాయింట్స్
ఊహాకు అందే వాదనలు
రేటింగ్ : 3/5