‘దయచేసి సినిమా చూడండి అంటూ ఎప్పుడూ బతిమాడలేదు. కానీ ఈ సినిమా కోసం అడుగుతున్నా. ఎవరూ ఈ సినిమాను మిస్ కావొద్దు. ఫ్యామిలీతో కలిసి వెళ్లండి. గొప్ప సినిమా చూశామనే అనుభూతికి లోనవుతారు’ అన్నారు హీరో నాని. ఆయన సమర్పణలో రూపొందిన చిత్రం ‘కోర్ట్- స్టేట్ వర్సెస్ ఏ నోబడీ’. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి రామ్ జగదీష్ దర్శకుడు. ప్రశాంతి తిపిర్నేని నిర్మాత. ఈ నెల 14న విడుదలకానుంది.
శుక్రవారం ప్రీరిలీజ్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. నాని మాట్లాడుతూ.. ఒకవేళ ఈ సినిమా అంచనాలను అందుకోనట్లు కనిపిస్తే.. రెండు నెలల్లో రిలీజ్ కాబోతున్న తన ‘హిట్-3’ సినిమాను ఎవరూ చూడొద్దని, గొప్ప కోర్ట్‌రూమ్ డ్రామాగా సినిమా ఆకట్టుకుంటుందని చెప్పారు.
మనందరి జీవితాలకు దర్పణంలా ఈ సినిమా ఉంటుందని, అద్భుతమైన టీమ్‌తో తెరకెక్కించడం ఆనందంగా ఉందని దర్శకుడు రామ్ జగదీష్ తెలిపారు. దర్శకుడు స్క్రీన్‌మీద ఓ పొయెట్రీ క్రియేట్ చేశాడని, విజయ్ బుల్గానిన్ మ్యూజిక్‌తో ప్రాణం పోశాడని నిర్మాత దీప్తి గంటా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకులు మోహనకృష్ణ ఇంద్రగంటి, శైలేష్ కొలను, దేవకట్టా, శౌర్యువ్ తదితరులు పాల్గొన్నారు.