కృత్రిమ మేధస్సును ఉపయోగించి సామాజిక మాధ్యమాల వేదికగా తమ పేరును దుర్వినియోగం చేస్తున్నారని, వ్యక్తిగత స్వేచ్ఛ.. ప్రచార హక్కులకు భంగం కలిగిస్తున్నారంటూ ఇటీవల పలువురు సినీ ప్రముఖులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. అమితాబ్‌బచ్చన్, ఐశ్వర్యరాయ్, అక్షయ్‌కుమార్ వంటి బాలీవుడ్ అగ్రతారలు ఇప్పటికే ఇదే అంశంపై కోర్టును ఆశ్రయించి ఉత్తర్వులు పొందారు. తాజాగా అగ్ర కథానాయకుడు చిరంజీవి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఆయన వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయన అనుమతి లేకుండా పేరు, ఫొటోలు, వాయిస్‌ను ఎలాంటి ఆన్లైన్ మాధ్యమాల్లో ఉపయోగించకూడదని తీర్పునిచ్చింది. ఎవరైనా టీఆర్పీ లాభాల కోసం, వాణిజ్య ప్రయోజనాల కోసం చిరంజీవి పేరును ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.
మెగాస్టార్, చిరు, అన్నయ్య వంటి టైటిల్స్ లేదా వాయిస్‌తో ఏ రూపంలోనైనా, ఎలాంటి మాధ్యమంలోనైనా వాణిజ్య లాభాల కోసం చిరంజీవి పేరును ఉపయోగించకూడదని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ముఖ్యంగా కృత్రిమ మేధ ద్వారా జరిగే వాణిజ్య దోపిడి, తప్పుడు ప్రచారాన్ని వెంటనే నిరోధించాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటికే కృత్రిమ మేధను ఉపయోగించి అసత్య పోస్టులు, నకిలీ వీడియోలను సృష్టించిన 30 మందికి కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.
ఈ నెల 11న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌ను కలిసినప్పుడే డిజిటల్ వేదికల్లో వ్యక్తిగత హక్కుల రక్షణ అంశం చర్చకు వచ్చింది. ఇలాంటి పెడధోరణులను సమర్థవంతంగా అరికట్టడానికి చిరంజీవి న్యాయనిపుణుల సలహాను కోరారు. ఇలాంటి ఉల్లంఘనలను అరికట్టేందుకు శిక్షా చట్టాలు మరింత కఠినంగా ఉండాల్సిన అవసరంపై ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా న్యాయస్థానంలో తనకు అనుకూలంగా తీర్పు రావడానికి కృషి చేసిన అడ్వకేట్ ఎస్.నాగేశ్రెడ్డితో పాటు ఆయన టీమ్‌కు చిరంజీవి ధన్యవాదాలు తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.