Sidhu Moosewala documentary | ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యపై బీబీసీ ఒక డాక్యుమెంటరీ రూపొందించిన విషయం తెలిసిందే. “ది కిల్లింగ్ కాల్” (The Killing Call) పేరుతో సిద్ధూ మూసేవాలా హత్యకు సంబంధించిన రెండు భాగాల డాక్యుమెంటరీని జూన్ 11న యూట్యూబ్‌లో విడుదల చేసింది. మూసేవాలా 32వ జయంతి సందర్భంగా ఈ డాక్యూమెంటరీని విడుదల చేశారు. అయితే ఈ వీడియోలను యూట్యూబ్‌లో నుంచి తొలగించాలని కోరడంతో పాటు స్ట్రీమింగ్ ఆపివేయాలని కోరుతూ మూసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్ మాన్సా కోర్టును ఆశ్రయించాడు.
ఈ డాక్యుమెంటరీలో అభ్యంతరకరమైన విషయాలు ఉన్నాయని, ఇవి ప్రస్తుతం విచారణలో ఉన్న కేసును ప్రభావితం చేయడమే కాకుండా, తమ కుటుంబ గోప్యతకు భంగం కలిగిస్తున్నాయని ఆరోపిస్తూ బల్కౌర్ సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే ఈ కేసు విచారణకు రాగా.. బీబీసీతో పాటు ఇతర ప్రతివాదులు తమ సమాధానాలను దాఖలు చేయడానికి మరింత సమయం కోరారు. దీంతో మాన్సా కోర్టు తదుపరి విచారణను జూన్ 16కు వాయిదా వేసింది. అప్పటిలోగా ప్రతివాదులు తమ లిఖితపూర్వక ప్రకటనలు, అలాగే స్టే అప్లికేషన్‌కు సంబంధించిన సమాధానాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.
పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా 2022 మే 29న దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. మాన్సా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్తుండగా, మార్గమధ్యంలో దుండగులు అడ్డగించి తుపాకీతో కాల్చి చంపారు. అప్పట్లో ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ హత్య కేసులో కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇక బీబీసీ తీసిన డాక్యూలో కూడా గోల్డీ బ్రార్‌తో జరిగిన ఆడియో ఇంటర్వ్యూ కూడా ఉందని సమాచారం. మరోవైపు ఈ డాక్యుమెంటరీని ముంబైలో బహిరంగంగా ప్రదర్శించాలని మొదట బీబీసీ భావించగా… న్యాయపరమైన సవాళ్లు, వివాదాల ఎదురైన నేపథ్యంలో యూట్యూబ్‌లో విడుదల చేయాలని నిర్ణయించుకుంది.