‘ ఈ కథ పోక్సో యాక్ట్ నేపథ్యంలో ఉంటుంది. ఈ యాక్ట్‌ని అధ్యయనం చేసి ఈ కథ రాశాను. రియల్‌లైఫ్ ఇన్సిడెంట్స్‌ని స్పూర్తిగా తీసుకుని తయారు చేసుకున్న ఫిక్షనల్ కథ ఇది.’ అని దర్శకుడు రామ్ జగదీష్ అన్నారు. ఆయన దర్శకత్వంలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన చిత్రం ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. హీరో నాని సమర్పణలో వాల్‌పోస్టర్ సినిమా పతాకంపై రూపొందిన ఈ సినిమాలో ప్రియదర్శి ప్రధాన పాత్రధారి. ఈ నెల 14న, అంటే.. రేపు సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు రామ్‌జగదీష్ బుధవారం విలేకరులతో ముచ్చటించారు. ‘ఫోక్సో యాక్ట్ అధ్యయనం చేసే క్రమంలో కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగాను. ఎందరో లాయర్లతో, పోలీసులతో ఇంటరాక్ట్ అయ్యాను. నిజానికి ఫోక్సో చట్టం గురించి బయట ప్రపంచానికి చాలా తక్కువ తెలుసు. దాని గురించి ఈ సినిమాలో డీటెయిల్‌గా చెప్పాం.’
అని తెలిపారు రామ్ జగదీష్. ‘నాని గారికి ఈ కథ చెప్పడానికి ఎనిమిది నెలలు ఎదురు చూశాను. ఫైనల్‌గా కథ చెప్పాను. ఆయన కథ వినే తీరు చూసి నాకు చాలా ఆనందంగా అనిపించింది. దాదాపు రెండున్నర గంటల కథని సింగిల్ సిట్టింగ్‌లో విన్నారాయన. కథ మొత్తం విని నిల్చుని షేక్ హ్యాండ్ ఇచ్చి ‘వెల్కమ్ టు వాల్‌పోస్టర్ సినిమా’ అన్నారు. అది నా జీవితంలో హై మూమెంట్.’ అని ఆనందం వెలిబుచ్చారు. ఇందులో ప్రతి పాత్రనూ ఆడిషన్ చేసే తీసుకున్నామని, ప్రియదర్శి పాత్ర అద్భుతంగా ఉంటుందని, శివాజీ ఇందులో మంగపతిగా కనిపిస్తారని, ప్రతి కుటుంబంలో అలాంటి క్యారెక్టర్ ఉంటుందని, ఇందులో యంగ్పెయిర్ రోషన్, శ్రీదేవి పాత్రలకు ప్రాణం పోశారని, సాంకేతికంగా అన్ని విధాలా సినిమా బావుంటుందని, అందరి జీవితం ఈ సినిమా, అందరూ తెలుసుకోవాల్సిన నిజం ఈ సినిమా అని రామ్ జగదీష్ చెప్పారు.