Ponniyin selvan | పొన్నియిన్ సెల్వన్ 2 చిత్రంలోని పాటపై వచ్చిన కాపీరైట్ కేసులో ఆస్కార్ అవార్డు విన్నర్, భారత సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్‌కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం గతంలో ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. 2023లో విడుదలైన మణిరత్నం చిత్రం పొన్నియిన్ సెల్వన్ 2లో ఎ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన వీరా రాజ వీరా(Veera Raaja Veera) అనే పాట వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ పాట తన తండ్రి ఫయాజుద్దీన్ డాగర్, మామ జాహిరుద్దీన్ డాగర్ స్వరపరిచిన శివస్తుతి పాటను పోలి ఉందని ఆరోపిస్తూ గాయకుడు ఉస్తాద్ ఫయాజ్ వసిఫుద్దీన్ డాగర్ ఢిల్లీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై గతంలో విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. ఎ.ఆర్. రెహమాన్, చిత్ర నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ రూ. 2 కోట్లు చెల్లించాలని పాట క్రెడిట్స్ లో పిటిషనర్ పేరును చేర్చాలని ఆదేశించింది.
అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏ.ఆర్ రెహమాన్ ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం ఈ కేసును విచారించిన జస్టిస్ హరిశంకర్, జస్టిస్ ఓం ప్రకాష్ శుక్లాలతో కూడిన ధర్మాసనం రెహమాన్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. వీరా రాజ వీరా పాట శివస్తుతి పాటను పోలి ఉందని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు తప్పు అని డివిజన్ బెంచ్ పేర్కొంది. రెహమాన్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని సింగిల్ జడ్జి తీర్పును పక్కన పెడుతున్నట్లు వెల్లడించింది. దీంతో ఈ కేసులో ఎ.ఆర్. రెహమాన్‌కు అనుకూలంగా తీర్పు వెలుబడింది.