Coolie vs War 2 | ఈ ఏడాది ఇండియన్ సినీ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ క్లాష్‌లలో ఒకటిగా ఆగస్టు 15న విడుదలైన “కూలీ” మరియు “వార్ 2” నిలిచాయి. ఒకవైపు సూపర్ స్టార్ రజనీకాంత్,అక్కినేని నాగార్జున కలయికలో వచ్చిన పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ “కూలీ” థియేటర్స్‌లోకి రాగా, ఆ సినిమాకి పోటీగా ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబినేషన్లో తెరకెక్కిన హై ఓక్టేన్ స్పై థ్రిల్లర్ “వార్ 2” విడుదలైంది. విడుదలకి ముందు నుంచే ఈ రెండు చిత్రాలపై భారీ అంచనాలు నెలకొనగా, విడుదలైన తర్వాత మాత్రం మోస్తరు వసూళ్లు సాధించినప్పటికీ, బ్లాక్‌బస్టర్ టాక్‌ను మాత్రం పూర్తిగా రాబట్టలేకపోయాయి.
థియేటర్ వసూళ్ల పరంగా “కూలీ” దక్షిణాది రాష్ట్రాల్లో భారీగా దూసుకెళ్లింది. ప్రత్యేకంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టింది. ఇక “వార్ 2” నార్త్ ఇండియన్ మార్కెట్లో మంచి వసూళ్లు సాధించింది. ముఖ్యంగా హృతిక్ రోషన్ క్రేజ్ హిందీ మార్కెట్లో బలంగా పనిచేసింది. అయితే అసలైన పోటీ ఇప్పుడు ఓటీటీ వేదికలపై చోటు చేసుకుంది. “కూలీ” అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుండగా, “వార్ 2” – నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయింది. ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్స్, వ్యూయర్ రెస్పాన్స్‌ల ప్రకారం చూస్తే, ఓటీటీ రన్లో మాత్రం “వార్ 2” పైచేయి సాధించినట్టుగా విశ్లేషకులు చెబుతున్నారు.
ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్లో విడుదల కావడం వల్ల “వార్ 2” కు రీచ్ పెరిగినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు “కూలీ”కి హిందీ ఆప్ట్షన్ లేకపోవడం ఓ మైనస్ పాయింట్‌గా మారిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో థియేటర్లలో రజనీ విజయం సాధించగా, ఓటీటీలో మాత్రం ఎన్టీఆర్ – హృతిక్ కాంబో గెలుపొందినట్టు స్పష్టమవుతోంది. కాగా, వార్ 2 చిత్రాన్ని అక్టోబర్ 9 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ చేస్తుండగా, ఆర్మాక్స్ రిపోర్ట్ ప్రకారం అక్టోబర్ 6 నుండి 12 వరకు ఇండియాలో అత్యధికంగా వీక్షించబడిన చిత్రంగా ‘వార్ 2’ నిలిచింది. ఈ చిత్రం మొత్తం 3.5 మిలియన్ వ్యూస్ సాధించి దూసుకెళ్లిందని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో గత వారం ఇండియాలోనే ఎక్కువ మంది వీక్షించిన సినిమాగా వార్ 2 నిలిచింది.