Coolie | రూ.1000 కోట్ల క్లబ్ లో తమ చిత్రం నిలవాలని భారతీయ సినీ పరిశ్రమలో ప్రతి స్టార్ హీరో, దర్శకుడు, నిర్మాత కలలు కనడం సహజం. దంగల్, బాహుబలి 2, కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్, పఠాన్, జవాన్, కల్కి 2898 ఏ.డి., పుష్ప 2 వంటి చిత్రాలు ఇప్పటికే ఈ ప్రతిష్ఠాత్మక క్లబ్లో చేరాయి. వీటిలో సగం టాలీవుడ్‌కు చెందినవే కావడం విశేషం. తెలుగు సినిమా ఇండస్ట్రీ సత్తా చాటుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతుండగా, మూడు బాలీవుడ్ సినిమాలు, శాండల్‌వుడ్‌కి చెందిన ఒక చిత్రం వెయ్యి కోట్ల క్లబ్లో చేరింది. అయితే కోలీవుడ్ మాత్రం ఇప్పటికీ వెయ్యి కోట్ల క్లబ్‌కి దూరంగానే ఉంది.
ఇటీవల సూర్య నటించిన భారీ బడ్జెట్ మూవీ కంగువా విడుదలైంది. మేకర్స్ ఈ సినిమాను “కోలీవుడ్ బాహుబలి”గా పుష్ చేయడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఆ అంచనాలకు సినిమా అనుగుణంగా రాకపోవడంతో అది నిరాశనే మిగిల్చింది. ఇక ఆ తర్వాత అందరి దృష్టి రజనీకాంత్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘కూలీ’ మూవీపై పడింది. అగస్టు 14న పాన్ ఇండియా రేంజ్లో విడుదలైన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాకు ముందస్తు బుకింగ్స్ అదిరిపోయే స్థాయిలో జరిగాయి. విడుదలకు ముందే వంద కోట్ల మార్క్ దాటి హైప్ క్రియేట్ చేసింది. అంతా కూడా ఇది కోలీవుడ్ మొదటి రూ.1000 కోట్ల మూవీ అవుతుంది అనే ఆశలతో ఉన్నారు.
అయితే ఇప్పుడు పరిస్థితి తేడాగా మారింది. ట్రేడ్ అనలిస్టుల అంచనాల ప్రకారం ‘కూలీ’ బాక్సాఫీస్ కలెక్షన్లు రూ.500 నుంచి రూ.600 కోట్లు మధ్యే ఆగే అవకాశం కనిపిస్తోంది.రూ.1000 కోట్ల టార్గెట్ సాధించడం చాలా కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ స్థాయి విజయాన్ని సాధించాలంటే కేవలం తమిళనాడు మార్కెట్‌తో సరిపోదు. హిందీ మార్కెట్లో బలమైన అడుగు వేసేలా, అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే కంటెంట్ అవసరం.బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, కల్కి సినిమాలు ఈ స్థాయిలో పాన్ ఇండియా లెవెల్లో రెస్పాన్స్ అందుకున్నాయి. కానీ కోలీవుడ్ ప్రాజెక్టులు ఇప్పటివరకు ఆ రేంజ్ రీచ్ కాలేకపోయాయి.ప్రస్తుతం ‘కూలీ’పై ఆశలు తగ్గిపోవడంతో, కోలీవుడ్ సినిమా పరిశ్రమకు వెయ్యి కోట్ల క్లబ్‌కి సంబంధించిన కల ఇంకా కలగానే మిగిలిపోతుందా అనే సందేహాలు నెలకొన్నాయి.