Coolie vs War 2 | ఆగస్ట్ 14న భారీ అంచనాల నడుమ కూలీ, వార్ 2 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఒకవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కూలీ’ , మరోవైపు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించిన ‘వార్ 2’ సినిమాలు థియేటర్లలో పోటీ పడుతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక బిజినెస్ పరంగా ఏ సినిమా పరిస్థితి ఏంటి? ఎవరిది అప్పర్ హ్యాండ్? తెలుగు మార్కెట్లో పరిస్థితి ఎలా ఉంది? అనే విషయాలపై ఆసక్తి నెలకొంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ క్రేజ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన ‘వార్ 2’లో కీలక పాత్రలో కనిపించడంతో, ఈ సినిమాకు భారీగా బిజినెస్ జరిగింది.
తెలుగు రైట్స్ విలువ 90.50 కోట్లు కాగా, నైజాం 36.5 కోట్లు, సీడెడ్ 18 కోట్లు, ఆంధ్ర 36 కోట్లుగా బిజినెస్‌గా జరిగింది. ఇక బ్రేక్ ఈవెన్ కావాలంటే, ‘వార్ 2’ రూ. 92 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది.ఇక రజనీకాంత్ సినిమాలకు తెలుగులో కూడా ఓ మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ ఇటీవల ఆయన సినిమాలు భారీ విజయాలు సాధించకపోవడం వల్ల బిజినెస్ కొంచెం తక్కువగానే జరిగిందని చెప్పాలి. నాగార్జున విలన్ పాత్రలో కనిపించడంతో కొంత హైప్ వచ్చింది. తెలుగు రైట్స్ విలువ 45 కోట్లు కాగా, ఇందులో నైజాం 16 కోట్లు, సీడెడ్ 10 కోట్లు, ఆంధ్ర 19 కోట్లు బిజినెస్ జరిగింది. అంటే ఈ సినిమాకు 46 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అని చెప్పాలి.
ఇక విదేశీ మార్కెట్లో రజనీకాంత్ సినిమాలకు పెద్ద క్రేజ్ ఉంది. ‘కూలీ’ ఓవర్సీస్ మార్కెట్లో దూసుకెళుతుంది. కూలీ ఓవర్సీస్ రైట్స్ 85 కోట్లు కాగా, వార్ 2 ఓవర్సీస్ రైట్స్ 56 కోట్లు మాత్రమే. మొత్తంగా చూస్తే వార్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్ 340 కోట్లు కాగా, కూలీ 305 కోట్లు అని తెలుస్తుంది. డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రావాలంటే, రెండు సినిమాలు కనీసం 600 కోట్లు గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది. వార్ 2 అయితే ఇంకా ఎక్కువ కలెక్షన్లు సాధించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘కూలీ’ ముందుంజాగా ఉంది. సోషల్ మీడియా ట్రెండ్, బుకింగ్ గణాంకాలు చూస్తే… రజనీ సినిమా ఊహించని రేంజ్లో దూసుకుపోతోంది. అడ్వాన్స్ బుకింగ్స్‌తో ఈ చిత్రం రూ.వంద కోట్ల దాకా రాబట్టింది. బుకింగ్స్‌తో రూ.100 కోట్ల మార్కును టచ్ చేయడం మామూలు విషయం కాదు. ఇక రిలీజ్ రోజు వసూళ్లను కూడా కలుపుకుంటే ‘కూలీ’ డే-1 రూ.150 కోట్ల మార్కును కూడా దాటే అవకాశముంది. తమిళ సినిమా ఓపెనింగ్ రికార్డులన్నింటినీ ఈ చిత్రం బద్దలు కొట్టడం లాంఛనమే. వెయ్యి కోట్ల సినిమా కోసం ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న కోలీవుడ్ ‘కూలీ’తో ఆ మార్కును టచ్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి.