NTR x Trivikram | మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రాబోతున్న పౌరాణిక చిత్రం తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఈ ప్రాజెక్ట్‌ను తక్షణమే నిలిపివేయాలంటూ తమిళనాడుకు చెందిన ‘నామ్ తమిళర్ కట్చి’ (NTK) పార్టీ అధినేత సీమాన్ డిమాండ్ చేశారు. చిత్ర బృందం విడుదల చేసిన ట్యాగ్‌లైన్స్, ప్రచార చిత్రాలపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ చిత్రంలో సుబ్రహ్మణ్యస్వామిని ఉత్తర భారతంలో పుట్టినవాడిగా.. ఉత్తరభారతదేశం దైవంగా చూపిస్తున్నారని, ఇది ముమ్మాటికీ చరిత్రను తప్పుదోవ పట్టించడమేనని సీమాన్ మండిపడ్డారు. సుబ్రహ్మణ్యస్వామి (మురుగన్) కేవలం తమిళుల ఆరాధ్య దైవమని, ఆయన సంస్కృతి, చరిత్ర తమిళ గడ్డతోనే ముడిపడి ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. సినిమా ప్రయోజనాల కోసం తమిళుల దైవాన్ని వేరే ప్రాంతానికి చెందినవాడిగా చిత్రీకరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తమిళుల మనోభావాలు దెబ్బతినేలా, వారి సాంస్కృతిక మూలాలను మార్చేలా ఈ చిత్రంలో దృశ్యాలు ఉంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని సీమాన్ స్పష్టం చేశారు. చిత్ర యూనిట్ వెంటనే ఈ విషయాన్ని గమనించి తగిన మార్పులు చేయాలని, లేనిపక్షంలో సినిమా విడుదలను అడ్డుకుంటామని, ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ వివాదం ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చకు దారితీసింది.