Eesha Success Meet | నిజాయితీతో కూడిన ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ‘ఈషా’ సినిమా మరోసారి నిరూపించింది. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ నిర్వహించిన సక్సెస్ మీట్‌కు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందాన్ని అభినందించారు. ఇటీవల ‘లిటిల్ హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ వంటి వరుస విజయాలతో జోరు మీదున్న బన్నీ వాస్, వంశీ నందిపాటి ద్వయం, ఇప్పుడు ‘ఈషా’తో హ్యాట్రిక్ సాధించారు. నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్లపై విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
కేఎల్ దామోదర్ ప్రసాద్ సమర్పణలో HVR ప్రొడక్షన్స్ బ్యానర్ మీద పోతుల హేమ వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రంలో త్రిగుణ్, హెబ్బా పటేల్, అఖిల్ రాజ్, సిరి హన్మంత్, పృథ్వీరాజ్ తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. ఈ సినిమాని బన్నీ వాస్, వంశీ నందిపాటి సంయుక్తంగా డిసెంబర్ 25న రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా సురేష్ బాబు ఈవెంట్లో మాట్లాడుతూ.. ‘మా దాముని ఫిల్మ్ ఛాంబర్ పనులు చూసుకోమని ఇటు సైడ్ పంపించాం. ఆ బాధ్యతలన్నీ కూడా దాము ఎంతో సమర్థవంతంగా చూసుకుంటున్నారు. మళ్లీ ఇలా ఆయన ‘ఈషా’ ఆడియెన్స్ ముందుకు రావడం ఆనందంగా ఉంది. ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చి హిట్ చేసిన బన్నీ వాస్, నంది వంశిపాటికి కంగ్రాట్స్. నిజాయితీతో సినిమా తీస్తే హిట్ చేస్తామని ఆడియెన్స్ మరోసారి నిరూపించారు. చిన్నసినిమా, పెద్ద సినిమా అనేది ఉండదు. కంటెంట్ బాగుంటే సినిమా ఆడుతుంది. కంటెంట్ ఉన్న చిత్రాల్నే ఆడియెన్స్ చూస్తారు. ఆడియెన్స్ పెట్టే డబ్బులు, వెచ్చించే సమయానికి తగ్గ కంటెంట్‌ను మనం ఇస్తున్నామా? లేదా? అన్నది చూసుకోవాలి. ఎవరో మీ కథను రిజెక్ట్ చేశారని నిరుత్సాహ పడొద్దు.. సరైన టైంకి అన్నీ జరుగుతాయి. పాజిటివ్‌గా ఉండండి. అంతా మంచే జరుగుతుంది. దాముకి హిట్ రావడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
కెఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘బన్నీ వాస్, వంశీలకు దిష్టి తీయాలి. పిలిచిన వెంటనే వచ్చిన నా స్నేహితులు సురేష్, అశోక్‌లకు థాంక్స్. అల్లు అరవింద్ గారు ఇచ్చే ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఈ ఏడాదిలో చిన్న చిత్రాలుగా వచ్చి హిట్టు కొట్టిన వారిని పిలవాలని అనుకున్నాను. అసలు సినిమాల్లో చిన్నా, పెద్ద అన్నది లేదు. ఏది ఆడితే అది పెద్ద సినిమా. ఆడకపోతే చిన్న చిత్రం. ‘ఈషా’ జర్నీ చాలా పెద్దది. ఈ ప్రయాణంలో శ్రీనివాస్ చాలా కష్టపడ్డాడు. గత 15 ఏళ్లుగా అతడి జర్నీని నేను చూస్తున్నాను. శ్రీను తనని తాను నిరూపించుకున్నాడు. ఇక నుంచి శ్రీను వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి రాకూడదు. సహనంతో ఉంటే ప్రతీ ఒక్కరికీ విజయం దక్కుతుంది’ అని అన్నారు.
బన్నీ వాస్ మాట్లాడుతూ .. ‘‘ఈషా’ మూవీతో మా దాము గారికి మంచి విజయం దక్కడం ఆనందంగా ఉంది. గత ఆరేళ్లుగా ఇండస్ట్రీలోని ఎన్నో సమస్యల్ని ఆయన పరిష్కరించారు. ఇప్పుడు ఆయనకు ఇలాంటి సక్సెస్ రావడం సంతోషంగా ఉంది. ఇకపై ఆయన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేయాలని కోరుకుంటున్నాను. ‘అలా మొదలైంది’ లాంటి ఎన్నో క్లాసిక్ చిత్రాల్ని తీయాలని ఆశిస్తున్నాను. ఆయన అభిరుచి ఉన్న నిర్మాత. మా డైరెక్టర్ శ్రీను చాలా ఎమోషనల్ అయ్యారు. అన్ని చిత్రాలు అందరికీ నచ్చవు. ఈ మూవీ ఆడియెన్స్‌కి కనెక్ట్ కాకపోతే ఐదు రోజుల్లో ఆరు కోట్ల గ్రాస్ వచ్చేవి కావు. శ్రీను గారు డైరెక్టర్‌గా సక్సెస్ అయ్యారు. సినిమా నచ్చకపోతే రివ్యూల్లో కాస్త చూసి పదజాలాన్ని వాడాలని కోరుకుంటున్నాను. నచ్చకపోతే నచ్చలేదని గౌరవంగా చెప్పండి. మీరు చేసే కామెంట్లతో దర్శకులు చాలా బాధపడారు. మీరు చేసే కామెంట్ కేవలం కామెంట్ కాదు.. అది డైరెక్టర్ జీవితం అవుతుంది. ఇప్పుడున్న టైంలో సినిమాని వినూత్నంగా ప్రమోట్ చేయాలి. ఈ ప్రయాణంలో మాకు సపోర్ట్ చేసిన మీడియా వారికి థాంక్స్’ అని అన్నారు.
వంశీ నందిపాటి మాట్లాడుతూ.. ‘‘ఈషా’ ఎన్నో మాటల్ని, ఒడిదుడుకుల్ని దాటుకుని ఇంత వరకు వచ్చింది. అందుకే సక్సెస్ బియాండ్ నాయిస్ అని పెట్టాం. శ్రీనివాస్ గారి ‘కథ’ మూవీని అందరూ చూసే ఉంటారు. ఇక ఇప్పుడు ‘ఈషా’తో విజయం సాధించారు. దాము గారి వల్లే ఈ సినిమా మా వరకు వచ్చింది. సక్సెస్‌ను సెలెబ్రేట్ చేసుకోవడంలో ఓ కిక్కు ఉంటుంది. ఆ కిక్కుని నాకు ఇస్తూనే ఉన్న ఆడియెన్స్‌కి థాంక్స్. ఆడియెన్స్ సపోర్ట్ చేయడం వల్లే ‘ఈషా’ వంటి చిత్రాలు విజయాన్ని సాధిస్తుంటాయి’ అని అన్నారు.
నటుడు, నిర్మాత అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ‘నేను సినిమాలు చూడటం చాలా వరకు తగ్గించేశాను. కానీ ఇక్కడ మాట్లాడిన వారి మాటలన్నీ వింటే నా తొలి రోజులు గుర్తుకు వచ్చాయి. వెంకటేష్ గారితో నేను తీసిన ‘రక్త తిలకం’ సంక్రాంతి పోటీలో రిలీజ్ చేసి రిస్క్ తీసుకున్నాం. యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు భయపడాల్సిన పని లేదు. బన్నీ వాస్ పేరు పడితే సినిమాకి ఓ గ్లామర్ వస్తుంది. మా కాలంలో ఇప్పటిలా సోషల్ మీడియా, నెగెటివిటీ అనేది లేదు. పాజిటివ్‌గా ముందుకు వెళ్తే కాస్త స్లోగా అయినా సరే సక్సెస్ కచ్చితంగా వస్తుంది’ అని అన్నారు.
దర్శకుడు శ్రీనివాస్ మన్నె మాట్లాడుతూ.. ‘‘ఈషా’ విజయోత్సవ వేడుకకు వచ్చిన సురేష్ బాబు గారికి, అశోక్ గారికి థాంక్స్. మా సినిమా బాగుందని ఆడియెన్స్ చెబుతున్నా కూడా ఎక్కడో ఫుల్ నెగెటివ్ ఎనర్జీ మా చుట్టూ తిరిగింది. ప్రేక్షకులు మా చిత్రాన్ని చూసి బాగుందని చెప్పారు. కానీ బుక్ మై షోలో చూస్తుంటే మాత్రం ఫుల్ నెగెటివిటీ. ఆ టైంలో నాకు చనిపోవాలని అనిపించింది. కానీ చివరకు ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆడియెన్స్‌కి నచ్చేలా సినిమాని తీయాలా? క్రిటిక్స్‌కి నచ్చినట్టు తీయాలా? అనే ఆలోచన వచ్చింది. అన్ని అడ్డంకుల్ని దాటుకుని ప్రస్తుతం ఇక్కడ వరకు వచ్చాం. నాకు ఈ ప్రయాణంలో అండగా నిలిచిన దాము గారికి థాంక్స్. సినిమా నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. కానీ వెంటాడి, వేటాడినట్టుగా మాత్రం చేయకండి. మా వైపు నుంచి కూడా కాస్త ఆలోచించండి. మీ రాతలతో మా బతుకుల్ని నాశనం చేయకండి. తప్పుల్ని ఎత్తి చూపండి. మేం కచ్చితంగా మార్చుకుంటాం. సోషల్ మీడియాలో నెగెటివిటీని కట్టడి చేయండని కోరుతున్నామ’ అని అన్నారు.
నిర్మాత హేమ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ.. ‘‘ఈషా’ సక్సెస్ మీట్‌కి సురేష్ బాబు గారు రావడం ఆనందంగా ఉంది. మా దాము గారు, బన్నీ వాస్ గారు, వంశీ గారి వల్లే జనాల వరకు రీచ్ అయింది. మా చిత్రానికి మొదట్లో నెగెటివిటీ వచ్చింది. అలాంటి నెగెటివిటీల్లోనూ జనాలు థియేటర్‌కు వెళ్లారు. ఇప్పటికీ చాలా చోట్ల హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. నిజంగానే సినిమా బాగా లేకపోతే రెండో రోజే థియేటర్ల నుంచి ఖాళీ అవుతోంది. మేం రివ్యూలని కూడా అంగీకరిస్తాం. కానీ సినిమాని మాత్రం చంపకండి. మా ‘ఈషా’ మూవీని చూసి నచ్చితే, బాగుంటే పాజిటివ్‌గా చెప్పండి. సినిమాని బతికించండి’ అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్ ధృవన్ మాట్లాడుతూ.. ‘‘జెన్యూన్‌గా ఓ కొత్త ప్రయత్నం చేస్తే హిట్ ఇస్తామని ‘ఈషా’తో ఆడియెన్స్ మరోసారి నిరూపించారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇది నాకు ఫస్ట్ థియేట్రికల్ హిట్. ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చిన శ్రీనివాస్ గారికి థాంక్స్. ఈ సినిమాని ఆడియెన్స్ వరకు తీసుకెళ్లిన బన్నీ వాస్ గారికి, వంశీ గారికి థాంక్స్’ అని అన్నారు.
నటుడు అఖిల్ రాజ్ మాట్లాడుతూ.. ‘కొత్త నటుడికి ఇలా వరుసగా విజయాలు దక్కడం అంత సులభం కాదు. ‘రాజు వెడ్స్ రాంబాయి’ని పెద్ద హిట్ చేశారు. మళ్లీ వెంటనే ‘ఈషా’ని హిట్ చేశారు. మాకు మొదట్లో నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. కానీ చివరకు సినిమానే మాట్లాడుతుంది. నన్ను సపోర్ట్ చేసిన దాము గారికి, శ్రీనివాస్ గారికి థాంక్స్. ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన తోటి ఆర్టిస్టులకు థాంక్స్’ అని అన్నారు.
నటి సిరి మాట్లాడుతూ.. ‘దాము గారు, బన్నీ వాస్ గారు, వంశీ గారు లేకపోతే ఈ రోజు ఈ‘ఈషా’ ఇంత పెద్ద విజయాన్ని సాధించేది కాదు. ఈ మూవీ సక్సెస్ క్రెడిట్ అంతా దర్శకుడు శ్రీనివాస్ గారిదే. నాకు ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
నటి ఉషా శ్రీ మాట్లాడుతూ.. ‘‘ఈషా’ చిత్రంలో పుణ్యవతి అనే పాత్రను పోషించాను. ఈ మూవీ ఇంత పెద్ద సక్సెస్ అవ్వడంతో నాకెంతో హ్యాపీగా ఉంది. ఈ మూవీతో నా జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభమైనట్టుగా అనిపిస్తుంది. ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన దాము గారికి, వంశీ గారికి, బన్నీ వాస్, వెంకట్ గారికి థాంక్స్’ అని అన్నారు.
ఈ విజయోత్సవ వేడుకలో‘కోర్ట్’ డైరెక్టర్ రామ్ జగదీష్, రచయిత లక్ష్మీ భూపాల, కళ్యాణీ మాలిక్, నిర్మాత బెక్కెం వేణుగోపాల్, తెలుగు టైటాన్ సీఈవో త్రినాథ్ రెడ్డి, నటుడు హర్షిత్, డైరెక్టర్ యదు వంశీ వంటి వారు అతిథులుగా విచ్చేసి సందడి చేశారు.
తారాగణం: త్రిగుణ్, హెబ్బా పటేల్, అఖిల్ రాజ్, సిరి హన్మంత్, పృథ్వీరాజ్ తదితరులు
సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్ మన్నె
నిర్మాత: పోతుల హేమ వెంకటేశ్వరరావు
సమర్పణ: కేఎల్ దామోదర్ ప్రసాద్
బ్యానర్: HVR ప్రొడక్షన్స్
సంగీతం: RR ధ్రువన్
DOP: సంతోష్ సనమోని
ఎడిటర్: వినయ్ రామసామి వి
ఫైట్స్: నందు