Kamal Hassan | దిగ్గజ తమిళ నటుడు కమల్ హాసన్ ఇటీవల కన్నడ భాష గురించి చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర వివాదానికి దారితీశాయి. “కన్నడ భాష తమిళం నుంచే పుట్టింది” అని ఆయన తన తాజా చిత్రం ‘థగ్ లైఫ్’ ఆడియో విడుదల వేడుకలో చేసిన వ్యాఖ్యలపై కన్నడిగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కమల్ హాసన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ కర్ణాటక రక్షణ వేదిక (కేఆర్వీ) అనే కన్నడ అనుకూల సంస్థ రంగంలోకి దిగింది. బెంగళూరులోని ఆర్.టి. నగర్ పోలీస్ స్టేషన్లో కమల్ హాసన్‌పై అధికారికంగా ఫిర్యాదు చేసింది. కమల్ వ్యాఖ్యలు కన్నడిగుల మనోభావాలను దెబ్బతీశాయని, కన్నడిగులు, తమిళుల మధ్య విద్వేషాలను సృష్టించేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేఆర్వీ డిమాండ్ చేసింది.
ఈ వివాదంపై కర్ణాటక రాజకీయ నాయకులు కూడా స్పందించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ, కమల్ హాసన్‌కు కన్నడ భాష చరిత్రపై సరైన అవగాహన లేదని, ఇతర భాషలను అవమానించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. కర్ణాటక బీజేపీ చీఫ్ బీ.వై. విజయేంద్ర కూడా కమల్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. పలువురు నేతలు కమల్ హాసన్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయగా, మరికొందరు ఆయన సినిమాలను కర్ణాటకలో నిషేధించాలని కూడా కోరారు.
కమల్ క్షమాపణలు
అయితే, ఈ వ్యాఖ్యలపై కమల్ హాసన్ స్పందిస్తూ క్షమాపణలు తెలిపాడు. తాను ప్రేమతో ఆ వ్యాఖ్యలు చేశానని, ఎవరినీ అగౌరవపరచాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. భాషల చరిత్ర గురించి మాట్లాడే అర్హత రాజకీయ నాయకులకు లేదని, ఈ చర్చను చరిత్రకారులు మరియు భాషా నిపుణులకు వదిలేయాలని సూచించారు. తాను ప్రేమతో అన్నందుకు క్షమాపణ కోరనని కూడా ఆయన పేర్కొన్నారు.
కమల్ హాసన్ వ్యాఖ్యల నేపథ్యంలో కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. కొన్నిచోట్ల కమల్ హాసన్ థగ్ లైఫ్ పోస్టర్లను దహనం చేసి, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ వివాదం ‘థగ్ లైఫ్’ సినిమా విడుదలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.