Oscar | యానిమేషన్ రంగంలో కొత్త ట్రెండ్ సెట్ చేసిన ‘మహావతార్ నరసింహా’ సినిమా మరో ప్రతిష్ఠాత్మక ఘనతను అందుకుంది. మహావిష్ణువు అవతారమైన నరసింహుని పౌరాణిక కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు అశ్విన్ కుమార్ అత్యున్నత ప్రమాణాలతో రూపొందించారు. నరసింహుడి ఉగ్రరూపాన్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన తీరు నుంచి బలమైన ఎమోషనల్ నేరేషన్, భారీ స్థాయి విజువల్స్ అన్ని ఈ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టాయి. కేవలం ₹30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం సంచలనాలు సృష్టించింది. పాజిటివ్ మౌత్ టాక్‌తో ఈ సినిమా ₹300 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి ఇండియన్ యానిమేషన్ మూవీస్ రేంజ్‌ను మరో రేంజ్‌కి తీసుకెళ్లింది.
ప్రత్యేకంగా నరసింహుడి ఎలివేషన్ సీన్స్‌కు వచ్చిన రెస్పాన్స్ అద్భుతం. వాటికి తగ్గట్టుగా ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆడియన్స్‌కు గూస్బంప్స్ తెప్పించేలా ఉందని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రివ్యూలు వెల్లువెత్తాయి. ఇక తాజాగా ‘మహావతార్ నరసింహా’ మరో గొప్ప గుర్తింపును అందుకుంది. రాబోయే 98వ అకాడమీ అవార్డ్స్ (Oscars) లో యానిమేషన్ కేటగిరీకి ఈ చిత్రం అధికారికంగా ఎంపికైనట్లు సమాచారం. ఈ విభాగంలో పాప్ డీమన్ హంటర్స్, ఇన్ఫినిటీ కాస్టెల్, అలాగే ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా వంటి సినిమాలు కూడా ఎంట్రీ సాధించాయి. ఈ జాబితాలో ‘మహావతార్ నరసింహా’ ఉండటం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం గర్వించే విషయంగా మారింది. అవార్డు గెలుస్తుందా లేదా అనేది ఇప్పుడే చెప్పడం కష్టం అయినప్పటికీ, ఆస్కార్ ఎంపిక దశ వరకు రావడం కూడా ఏ యానిమేటెడ్ చిత్రానికైనా గొప్ప మైలురాయి.
ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నదాని ప్రకారం ఈ గుర్తింపు భారతీయ యానిమేషన్ రంగానికి కొత్త ప్రోత్సాహం ఇస్తుందని, గ్లోబల్ స్టాండర్డ్స్‌ను చేరుకునే ప్రయత్నంలో ఉన్న అనేక స్టూడియోలుకు ఇది ఒక పాజిటివ్ ఎనర్జీగా మారనుందని అంటున్నారు. మైథలాజికల్ యానిమేషన్ సినిమాలకు కూడా ఇలాంటి అంతర్జాతీయ రీచ్ సాధ్యమని ‘మహావతార్ నరసింహా’ నిరూపించింది. ఇండియన్ యానిమేషన్ సినిమాల భవిష్యత్తుకు ఇది సరికొత్త దారిని చూపే ఘనతగా అభిమానులు భావిస్తున్నారు.