జీవితపథంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలాంటి బాదరబందీలు లేకుండా స్నేహితులతో ఉల్లాసంగా గడిపిన బాల్యం నాటి రోజులే గొప్పగా అనిపిస్తాయి. ఈ అంశం ప్రధానంగా రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. యదు వంశీ దర్శకుడు. నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటున్నది. శుక్రవారం టీజర్‌ను హీరో నితిన్ సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు.
ఇందులో ఓ మిత్రబృందం తాలూకు బాల్యాన్ని, యుక్తవయసులో వారు చేసిన సరదా సంగతులను చూపించారు. చివరగా ఊరిలో యువత ఎందుకు గొడవల్లోకి దిగుతారు. అందుకు కారణమేమిటనే అంశాలను తెరపై చూడాల్సిందేనంటూ ఆసక్తిగా టీజర్‌ను ముగించారు. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాజు ఎడురోలు, సంగీతం: అనుదీప్‌దేవ్, రచన-దర్శకత్వం: యదు వంశీ.