Comedians | సినీ పరిశ్రమలో నటీనటుల మధ్య ఉన్న స్నేహబంధాలు ప్రత్యేకమైనవి. కొంతమంది సెలబ్రిటీలు గ్రూపులుగా ఏర్పడి తరచూ కలిసి పార్టీలు, ట్రిప్‌లు అంటూ ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటి గ్రూపులలో టాలీవుడ్ కమెడియన్స్ ఏర్పాటు చేసుకున్న ‘ఫ్లైయింగ్ కలర్స్’ గ్రూప్ ఒకటి. ఈ గ్రూప్‌లోని సభ్యులు ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా రెడీ అయి గ్రూప్ ఫోటోలతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటారు. ఈ సారి నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సందర్భంగా వీరు చేసిన ఫన్ ఫోటోషూట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఈ గ్రూప్‌కు చెందిన కమెడియన్స్ అందరూ కలిసి స్కూల్ డ్రెస్ లో చిన్నపిల్లల మాదిరి కనిపించి సందడి చేశారు. వైట్ షర్ట్, టై, నిక్కర్ ధరించి చిన్నపిల్లల్లా రెడీ అయ్యారు. ఈ యూనిఫామ్‌లో అందరు పోజులిస్తూ దిగిన ఫోటోను కమెడియన్ ధనరాజ్ సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది క్షణాల్లో వైరల్ అయింది. ఫోటోలో నవీన్ నేని, ధనరాజ్, సప్తగిరి, నందు, సత్య, వేణు,వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, రఘు ఉన్నారు. ఈసారి గ్రూప్‌లోని మరో ప్రముఖ నటుడు ప్రవీణ్ మాత్రం కనిపించలేదు. ‘ఫ్లైయింగ్ కలర్స్’ పేరుతో ఏర్పడిన ఈ గ్రూప్ తరచూ కలిసి పార్టీలు, గెట్-టు గెదర్స్ అంటూ సందడి చేస్తూ ప్రేక్షకులకు తమ ఆఫ్-స్క్రీన్ బాండింగ్ చూపిస్తుంటారు.
సినిమాల్లో అద్భుతమైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే వీరు, రియల్ లైఫ్‌లో కూడా ఇలా కలిసి ఫన్ చేస్తూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌కు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. చిల్డ్రన్స్ డే రోజు ఇలా స్కూల్ కిడ్స్‌లా రెడీ కావడం చూసి అభిమానులు ఫోటోలపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి, టాలీవుడ్ కమెడియన్స్ స్కూల్ యూనిఫామ్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్ ట్రెండ్ గా మారింది.