విద్వేష ప్రచారకులకు కనువిప్పు కలిగించే చిత్రమిదని సీంఎ సిద్ధరామయ్య ప్రశంసలు గత ఏడాది హిజాబ్ వివాదం కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపి వేసింది. విద్యార్థుల మధ్య మతపరమైన ఉద్రికత్తలను సృష్టించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నం చేశాయి. అయితే ఈ గొడవల వెనకున్న కుట్రను ప్రజలు అర్థం చేసుకోవడంతో ఈ వివాదం క్రమంగా సద్దుమణిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల అధికార పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మతసామరస్యాన్ని చాటుతూ తెరకెక్కించిన ‘డేర్ డెవిల్ ముస్తఫా’ చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వడం అందరి ప్రశంసలందుకుంటున్నది.
ప్రముఖ కన్నడ రచయిత పూర్ణచంద్ర తేజస్వి రాసిన షార్ట్స్టోరీ ఆధారంగా దర్శకుడు శశాంక్ సొహగల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మతసామరస్య అవశ్యకతను చాటుతూ అందరిని ఆకట్టుకుంటున్నది. 1970 దశకం నేపథ్యంలో నడిచే ఈ కథలో ఓ ముస్లిమ్ యువకుడు హిందువులు ఎక్కువగా ఉండే కాలేజీలో చేరతాడు. ఈ నేపథ్యంలో విద్యార్థుల మధ్య తలెత్తిన అభిప్రాయభేదాలు, చివరకు పరస్పర ప్రేమాభిమానాలతో అందరు కలిసి పోయిన వైనాన్ని ఈ చిత్రంలో అద్భుతంగా ఆవిష్కరించారు.
ఈ సినిమాకు పన్ను మినహాయింపును ప్రకటించిన అనంతరం సీఎం సిద్ధరామయ్య తన ట్విట్టర్ ఖాతాలో చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ ఓ పోస్ట్ పెట్టారు. పరస్పర సహకారం, సౌభ్రాతృత్వంతోనే సమాజంలో శాంతి పరిఢవిల్లుతుందనే సందేశాన్ని ఈ సినిమాలో గొప్పగా ఆవిష్కరించారని, విద్వేష ప్రచారకులకు కనువిప్పు కలగాలంటే ఈ తరహా చిత్రాలు మరిన్ని రావాలని సిద్ధరామయ్య ఆకాంక్షించారు.