కథ బాగుంటే సినిమా మినిమమ్ గ్యారెంటీ! ఆ సినిమాలో పాటలు బాగుంటే.. బొమ్మకు తిరుగుండదు. మరి కథే.. సంగీతమైతే, అది చిత్రరాజం అవుతుంది. దశాబ్దాలు గడిచినా ఆ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచి ఉంటుంది. సంగీత ప్రధానంగా తెరకెక్కిన సినిమాలు వెండితెర కావ్యాలుగా చిరకీర్తిని మూటగట్టుకున్నాయి. రసహృదయులను అలరించాయి. పండితుల ప్రశంసలు పొందాయి. అలాంటి చిత్రమాలికలోని పుష్య‘రాగాల’ను ఒకసారి తలుచుకుందాం..
Musical Hits | ‘శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః..’ అని ఆర్యోక్తి. శిశువులు, పశువులు, పక్షులు, చివరికి విష సర్పాలు సైతం సంగీతానికి వశం కావలసిందే! వ్యాధుల్ని సైతం నయం చేసే ఔషధి సంగీతం. అదో జీవధార.. ఇంకా మాట్లాడితే మహాసముద్రం. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, పండిట్ జస్రాజ్, పండిట్ భీమ్సేన్ జోషి ఇలా ఎందరో సంగీత దిగ్గజాలు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని తమ గానామృతంతో ద్విగుణీకృతం చేశారు.
ఆ కళామూర్తుల ప్రతిభ పండితులకే పరిమితమైందన్న వాదనను కూడా కొట్టిపారేయలేం. ఈనాడు శాస్త్రీయ సంగీతం పామరులకు సైతం చేరువైందంటే అందులో సినిమా పాత్ర చాలానే ఉంది. కచేరీలకే పరిమితమైన గమకాల విన్యాసాలను కోట్లాది మంది శ్రోతలకు చేరువ చేసింది సినిమా. ఇందులో సంగీత ప్రధాన చిత్రాల పాత్ర కీలకం.
నాగయ్య.. త్యాగయ్య
‘త్యాగయ్య’.. నాగయ్య స్వీయదర్శకత్వంలో నటించి, నిర్మించిన సినిమా. ఈ చిత్రానికి సంగీతం కూడా ఆయనే అందించారు. స్వరాలు అందించడమే కాదు.. ఆగమనుతుడికి అంకితమైన త్యాగయ్య కీర్తనల్నీ సుస్వరంగా గానం చేశారు. త్యాగయ్య పాత్రలోకి నాగయ్య పరకాయ ప్రవేశమే చేశారు. 1946లో విడుదలైన ఈ సినిమా అఖండ విజయాన్ని సాధించింది.
ఇందులోని ‘సామజవరగమనా..’, ‘నగుమోము.. గనలేని..’, ‘ఎందరో మహానుభావులు..’, ‘నిధి చాలా సుఖమా..’ కీర్తనలు నాగయ్య గొంతుకలో కొత్త జీవం పోసుకున్నాయి. ముఖ్యంగా భవబంధాలనూ పరిత్యజించి, రామసాయుజ్యం కోసం ఎదురుచూసే తాగరాజస్వామిగా పతాక సన్నివేశంలో నాగయ్య అభినయం అనితరసాధ్యం. అందుకే.. తెలుగు సినీచరిత్రలో నాగయ్య ‘త్యాగయ్య’ ఓ అజరామర కావ్యం.
సంగీత ఝరి.. ‘జయభేరి’
1940వ దశకం చివరి నాటికి తెలుగు సినిమా సంగీతంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఉద్దండులైన సంగీత మార్తాండులు చిత్రరంగ ప్రవేశం చేశారు. సాలూరి రాజేశ్వరరావు, ఘంటసాల, పెండ్యాల, టీవీ రాజు, కేవీ మహదేవన్, మాస్టర్ వేణు.. వీరంతా ఈ ఎరాలో వచ్చినవారే. వీరంతా అప్పటికి అందుబాటులో ఉన్న సాంకేతికతతో ప్రయోగాలకు పూనుకున్నారు. తెలుగు సినిమాకు స్వర్ణయుగం మొదలైంది. వెండితెర సంగీతం కొత్త పల్లవి అందుకుంది.
ఈ సమయంలో వచ్చిన పూర్తి సంగీత భరిత చిత్రం అక్కినేని నాగేశ్వరరావు ‘జయభేరి’. 1959లో విడుదలైన ఈ సినిమా ఫస్ట్ రిలీజ్లో అంతగా ఆడకపోయినా.. సెకండ్ రిలీజ్లో శతదినోత్సవాలు జరుపుకొన్నది. ఈ చిత్రంలోని పాటలు నిజంగా ఆ పాత మధురాలే. సంగీత దర్శకుడిగా పెండ్యాల నాగేశ్వరరావు విశ్వరూపం ఈ సినిమా. అలాగే గాయకుడిగా ఘంటసాల విరాట్ స్వరూపం ఈ సినిమా. ‘రసికరాజ తగువారముగామా..’, ‘అధికులనీ.. అధములనీ..’, ‘రాగమయీ రావే..’, ‘యమునా తీరమున..’ పాటలు గ్రామ్‌ఫోన్ రికార్డులు బద్దలు కొట్టాయి. పార్కు రేడియోల్లో మార్మోగాయి. గ్రామ కూడళ్లలో విపరీతంగా వినిపించాయి.
ఈ సినిమా విడుదలయ్యాక ఎక్కడ పాటల పోటీలు జరిగినా.. పోటీదారులంతా ‘జయభేరి’ గీతాలే అందుకునేవారంటే.. ఆ చిత్ర ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా పీబీ శ్రీనివాస్‌తో కలిసి ఘంటసాల ఆలపించిన ‘మది శారదాదేవి మందిరమే..’ పాటకు సంగీతజ్ఞులు సైతం ఓలలాడారు. ఇక అక్కినేని అభినవ కౌశలం గురించి ఎంత చెపుకొన్నా తక్కువే. పతాక సన్నివేశంలో ఆయన నటన శిఖరస్థాయిలో ఉంటుంది.
వినుడు వినుడు.. లవకుశ కథా వస్తువు సంగీతం కాకపోయినా…
‘లవకుశ’ చిత్రం సంగీత భరితమై ప్రేక్షకులను అలరించింది. వాల్మీకి రామాయణ గాథను సీనియర్ సముద్రాల మూడు పాటల్లో వర్ణించిన తీరు అమోఘం. వాటికి ఘంటసాల కట్టిన బాణీలు రామకథంత రసరమ్యంగా కుదిరాయి. అందుకే ‘లవకుశ’ గీతాలు కాలాతీతంగా అలరిస్తూనే ఉన్నాయి.
‘రామకథను వినరయ్యా…’, ‘వినుడు వినుడు రామాయణగాధ..’, ‘శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ..’.. ఈ మూడు పాటలు వింటే రామయణం మొత్తం విన్నట్టే. అంతేకాదు.. సినిమాలో సన్నివేశాలకు అనుగుణంగా వచ్చిన పాటలన్నీ హిట్టే! ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో..’, ‘సందేహింపకు మమ్మా..’, ‘ఊరికే కన్నీరు నింప కారణమేమమ్మా..’ తదితర గీతాలు శ్రీరామనవమి సందర్భంగా ఊరూరా మార్మోగుతూనే ఉంటాయి.
ఓంకార నాదం.. శంకరాభరణం
కళాతపస్వి కె.విశ్వనాథ్ ‘శంకరాభరణం’(1980).. పాశ్చాత్య సంగీతపు పెనుతుఫాన్‌కు రెపరెపలాడుతున్న సత్ సంప్రదాయ సంగీత జ్యోతిని ఒక కాపుకాయడానికి ఓ దర్శక దిగ్గజం చేసిన మహాయజ్ఞం ఈ సినిమా. ‘ఓంకార నాదాను సంధానమౌ గానమే..’, ‘దొరకునా ఇంటువంటి సేవ..’, ‘శంకరా నాదశరీరాపరా’, ‘బ్రోచేవారెవరురా..’, ‘సామజవరగమనా..’ ఈ పాటలు విని తరించని తెలుగువాడు లేడు.
తెలుగునాట శాస్త్రీయ సంగీత ప్రస్థానం ‘శంకరాభరణం’ ముందు-తర్వాత అన్నట్టుగా మారిపోయింది. వేటూరి సాహిత్యం, కేవీ మహదేవన్ సంగీతం, ఎస్పీ బాలు గాత్రం ఇవన్నీ విశ్వనాథ్ సినీకచేరీకి పక్క వాద్యాలుగా పనిచేశాయి. ఇలాంటి సినిమా ఆలోచించడం.. ఇంత గొప్పగా తెరకెక్కించడం.. దైవలిఖితమే. నిజం చెప్పాలంటే మళ్లీ కె.విశ్వనాథ్ కూడా ఇంత గొప్ప సినిమా తీయలేకపోయారు. అది విశ్వనాథే అంగీకరించారు కూడా! ఓ విధంగా తనంతట తానుగా తయారైన సినిమా ‘శంకరాభరణం’. పురాణ, ఇతిహాసాల గురించి భాషణం చేసే చాగంటి కోటేశ్వరరావు.. ‘శంకరాభరణం’ గురించి రెండు రోజులపాటు మూడేసి గంటలు ప్రవచనం చెప్పడం ఆ సినిమా స్థాయిని తెలియజేస్తుంది.
అదికూడా ఆ సినిమా విడుదలైన మూడు పుష్కరాల తర్వాత. ఇంతకంటే ఆశ్చర్యం ఏముంటుంది చెప్పండి!?. విశేషం ఏంటంటే.. ‘శంకరాభరణం’ విడుదలయ్యాక, తెలుగునేలపై సంగీత పాఠశాలలు వందల్లో వెలిశాయి. వేలాదిమంది పిల్లలు సంగీతం నేర్చుకోవడానికి ఆసక్తి చూపించారు. అందుకే ‘శంకరాభరణం’ ఆల్‌టైమ్ క్లాసిక్. తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిత్రం. ‘శంకరాభరణం’ తర్వాత విశ్వనాథ్ లలితకళల చుట్టూ తిరిగే కథాంశాలతో ఎక్కువ సినిమాలు చేశారు. వాటిలో సిరివెన్నెల, శృతిలయలు, స్వాతి కిరణం, స్వరాభిషేకం సినిమాల నేపథ్యం శాస్త్రీయ సంగీతమే కావడం విశేషం. విశ్వనాథ్ తర్వాత ఈ తరహా సినిమాలు చేయడానికి ఏ దర్శకుడూ ధైర్యం చేయలేదు. ఎవరూ ముట్టుకోలేని జానర్ ఇది.
ఏది ఏమైనా.. సినిమాకు అద్భుతమైన సంగీతం ఉంటే సరిపోదు. చక్కటి కథ కుదరాలి. అందులో సంగీతం సరిగ్గా ఇమడాలి. చూసిన ప్రేక్షకులకు పాత్రలు గుర్తుండిపోవాలి. సన్నివేశాలు వెంటాడాలి. పైన ప్రస్తావించిన సినిమాలన్నీ ఆ తరహా సినిమాలే.. అలాంటి కథలు, అలాంటి పాటలు, అలాంటి పాత్రలతో.. మన తెలుగు వెండితెర మరోసారి మోహన రాగంలో ప్రేక్షకులను సమ్మోహన పరచాలని ఆశిద్దాం.
…? బుర్రా నరసింహా