Akhanda 2 | నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ‘అఖండ 2: తాండవం’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సింహా, లెజెండ్, అఖండ వంటి బ్లాక్బస్టర్లతో వీరి కాంబో ఇప్పటికే హిట్ ఫార్ములాగా నిలిచిన సంగతి తెలిసిందే. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న అఖండ 2 చిత్రానికి బాలయ్య చిన్న కుమార్తె ఎం.తేజస్విని నందమూరి సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్లో 600 మంది డ్యాన్సర్లతో మాస్ సాంగ్‌ని చిత్రీకరించారు. భాను కొరియోగ్రఫీలో, తమన్ స్వరపరిచిన ఈ పాట బాలయ్య ఎనర్జీ, మాస్ మూమెంట్స్‌తో థియేటర్లలో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుందని యూనిట్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.
ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ అద్భుత స్పందన తెచ్చుకొని సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తుండగా, ఆది పినిశెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు ప్రధాన సన్నివేశాల షూట్ దాదాపు పూర్తయింది. మేకర్స్ తొలుత దసరా కానుకగా సెప్టెంబర్ 25న సినిమాను విడుదల చేయాలని ప్రకటించినా, షూటింగ్ ఆలస్యం కావడంతో వాయిదా వేశారు. తాజాగా అఖండ 2 విడుదలపై బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ లాబీలో నందమూరి బాలకృష్ణ, ఎమ్మెల్యేలకు చిట్ చాట్ జరగగా, ఆ సమయంలో . బాలకృష్ణకు ఎదురుపడిన ఎమ్మెల్యేలు, మంత్రులు అఖండ 2 రిలీజ్ గురించి అడిగారు.
ఆ సమయంలో బాలయ్య… డిసెంబర్ 5న అఖండ 2 విడుదలవుతుందని తెలియజేశారు. పాన్ ఇండియా సినిమాగా వివిధ భాషల్లో తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. హిందీ డబ్బింగ్ కూడా చాలా బాగా వచ్చిందని బోయపాటి శ్రీను అన్నారని వెల్లడించారు. అన్ని భాషల్లోనూ ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పిన బాలయ్య తాను ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు తెలియజేశారు. అఖండ మూవీని జనాలు ఎంతో ఆదరించారు. అఖండ 2 కోసం ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.