నీలకంఠ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘సర్కిల్’. సాయిరోనక్, బాబా భాస్కర్, అర్షిణ్ మెహతా, రిచా పనై, నైనా కీలక పాత్రల్లో నటించారు. సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కించిన ఈ చిత్రం జూలై 7న విడుదల కానుంది. సోమవారం ట్రైలర్ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘నా సినిమాల్లో నాయికల పాత్రలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇందులో కూడా అదే పంథాను కొనసాగించాను. స్వతంత్య్ర భావాలు కలిగిన యువతిగా రిచాపనై, ధైర్యసాహసాలు మూర్తీభవించిన రాజకుమారి పాత్రలో అర్షిణ్ మెహతా ఆకట్టుకుంటారు. జీవితమే ఓ సర్కిల్ అనే ఫిలాసఫీని చెబుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’ అన్నారు. తన కెరీర్లోనే బెస్ట్ రోల్ ఇదని హీరో సాయిరోనక్ తెలిపారు. సినిమాలో అరుంధతిగా తన పాత్ర భిన్న కోణాల్లో సాగుతుందని రిచా పనై చెప్పింది. తెలుగు తెరపై ఇప్పటివరకు రానటువంటి విభిన్నమైన కథ ఇదని నిర్మాత శరత్ చంద్ర పేర్కొన్నారు.