సెకండ్ ఇన్నింగ్స్ లాంటి కెరీర్ లో జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి చిత్రాల తర్వాత సినిమా మీద సినిమా సైన్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ సినిమాలో పనిచేయాలని కలగన్న నటీనటులు, సాంకేతిక నిపుణులకు అనూహ్యంగా అవకాశాలు దొరుకుతున్నాయి. వాళ్లకు ఈ సినిమాలు జీవితకాలం గుర్తుండిపోనున్నాయి.
ఈ క్రమంలో దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబీ) తో సినిమా చేస్తున్నారు చిరంజీవి. ఇది మెగాస్టార్ కు 154వ సినిమా. విశాఖ నేపథ్యంగా సాగే ఈ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ ను కుదిర్చే పనిలో ఉన్నారు చిత్రబృందం. గతంలో ఈ సినిమాకు వాల్తేర్ వీర్రాజు అనే టిటైల్ పెడుతున్నట్లు వార్తలొచ్చాయి. తాజాగా మరింత శక్తివంతమైన టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వాల్తేర్ మొనగాడు అనే పేరును చిరు 154వ చిత్రానికి పెడుతున్నట్లు సమాచారం.
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ నాయికగా నటిస్తున్నది. చిరు జోడీగా కుదరడంతో మెగా ఫ్యామిలీలో శృతి దాదాపు అందరు హీరోల సరసన నటించినట్లయింది. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా మెగా కథానాయకుల సరసన నటిచింది శృతి. ఇటీవల కోవిడ్ నుంచి కోలుకున్న చిరంజీవి తన సినిమాల షూటింగ్ లను పున ప్రారంభించారు. ప్రస్తుతం భోళా శంకర్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు చిరంజీవి.