తెలుగు సినీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు 30శాతం పెంచాలని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు కోరారు. కార్మికుల వేతనాలు పెంచాలని ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌కుమార్, ప్రధాన కార్యదర్శి కె.అమ్మరాజు, కోశాధికారి అలెంగ్జాడర్లు మంగళవారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని కార్మిక శాఖ కార్యాలయంలో అదనపు కార్మిక కమిషనర్ డాక్టర్ ఇ.గంగాధర్‌తో కలిసి చర్చలు జరిపారు. వినతి పత్రం ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు మూడు సంవత్సరాలుగా పెంచలేదని తెలిపారు. మూడు సంవత్సరాలకు గాను 30శాతం పెంచాలని, సంవత్సరానికి 10శాతం చొప్పన పెంచాలని కోరడం జరిగిందని వారు తెలిపారు. సినీ కార్మికులు ప్రతి రోజూ 18గంటలకు పైగా పనిచేస్తున్నారని, దానికి తగ్గట్లు వేతనాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
20వేలకు పైగా ఉన్న కార్మికులు పనికి తగట్టు వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. సినిమా నిర్మించడంలో కీలకంగా పనిచేస్తున్న కార్మికులు, ఆర్థిక సమస్యల వల్ల.. కుటుంబంతో కలిసి తాము పనిచేసిన సినిమాను కూడా చూడలేని పరిస్థితి నెలకొందన్నారు. తమ సమస్యలను అదనపు కమిషనర్ ఇ.గంగాధర్ దృష్టికి తీసుకెళ్లాగా ఆయన నిర్మాతల అసోసియేషన్ నాయకులతో మాట్లాడి, బుధవారం ఆ విషయాలను వెల్లడి చేస్తామని హామీ ఇచ్చారు.
ఇక నిర్మాతలు కూడా ఈ విషయంలో తగ్గేదేలేదు అంటున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఫిల్మ్‌ఛాంబర్‌తో మంగళవారం భేటీ కావడం ఆసక్తిగా మారింది. ఛాంబర్ నిర్ణయమే ‘మా’ నిర్ణయం అంటూ నిర్మాతలకు ఆయన సంఘీభావం తెలిపారని పలువురు నిర్మాతలు తెలియజేశారు. 30శాతం వేతనాలు పెంచడం సాధ్యం కాదని, బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, ఐటీ ఉద్యోగుల కంటే యూనియన్ కార్మికుల జీతాలే అధికమని, షూటింగులకు ఫెడరేషన్ సహకరించని పక్షంలో ఔత్సాహికులకు అవకాశాలివ్వడానికి సిద్ధంగా ఉన్నామని టీఎఫ్‌సీసీ స్పష్టం చేసింది. ఇప్పటికే నిపుణుల సిబ్బంది కోసం అప్లికేషన్స్ కూడా తీసుకుంటున్నారని సమాచారం.
మరోవైపు ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్‌కి కూడా పలు కార్మిక సంఘాలు మద్దతు తెలియజేస్తున్నాయి. రెండోరోజు కూడా సమ్మె కొనసాగడంతో సినీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు జరుగుతున్న ప్రయత్నాలన్నీ విఫలం అవుతున్నాయి. ఫిల్మ్‌ఛాంబర్, ఎంప్లాయిస్ ఫెడరేషన్ నిర్ణయాల మధ్య సాధారణ సినీకార్మికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఓ పక్క కార్మిక సంఘాలు లేబర్ కమిషనర్ గంగాధర్‌ని కలవగా, మరోపక్క అగ్ర నటుడు చిరంజీవితో నిర్మాతలు సమావేశమయ్యారు. అల్లు అరవింద్, సి.కల్యాణ్ సుప్రియ యార్లగడ్డ, యలమంచిలి రవిశంకర్ తదితర నిర్మాతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నిర్మాతల సమస్యలు విన్న చిరంజీవి.. కార్మికుల వెర్షన్ కూడా విని నిర్ణయం తీసుకుంటానని నిర్మాతలతో అన్నారట. రెండుమూడు రోజుల్లో పరిస్థితి చక్కబడని పక్షంలో తాను జోక్యం చేసుకుంటానని నిర్మాతలకు చిరంజీవి హామీ ఇచ్చారట.