Pakistani actors | జమ్ము కశ్మీర్‌లోని పహల్గాం దాడి ఘటనకు సంబంధించి భారత సైన్యం ఇటీవల పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో మెరుపు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ తర్వాత కొందరు పాకిస్తానీ కళాకారులు ఇండియన్ ఆర్మీని చేసిన దాడిని తప్పుబడుతూ పోస్టులు పెట్టారు. అయితే ఈ వ్యాఖ్యలు దేశ వ్యతిరేకంగా ఉన్నాయని భారతీయ సినీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ముఖ్యంగా పాకిస్తానీ నటులైన ఫవాద్ ఖాన్, మహీరా ఖాన్ ఆపరేషన్ సింధూర్‌పై స్పందిస్తూ.. మహీరా ఖాన్ భారత సైన్యం చర్యను “పిరికి చర్య” అని అభివర్ణించగా, ఫవాద్ ఖాన్ ఉగ్రవాదాన్ని ఖండించకుండా భారతదేశ వైఖరిని విమర్శించారని పేర్కొంది. ఈ వ్యాఖ్యలు దేశానికి, ఉగ్రవాదానికి బలైన అమాయక ప్రజలకు, దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులకు అవమానకరమని AICWA ఆగ్రహం వ్యక్తం చేసింది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ పాకిస్తానీ కళాకారులను గుడ్డిగా సమర్థించడాన్ని మానుకోవాలని AICWA కోరింది. కళ పేరుతో దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసే వారిని ప్రోత్సహించడం జాతీయ గర్వాన్ని అవమానించడమేనని అభిప్రాయపడింది. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ తమ దేశానికి మద్దతు తెలుపుతున్న పాకిస్తానీ కళాకారులకు భారతీయ కళాకారులు మద్దతు ఇవ్వడం సరికాదని హితవు పలికింది.
AICWA ఇప్పటికే పాకిస్తానీ కళాకారులు, నిర్మాతలు మరియు ఫైనాన్షియర్లపై పూర్తి నిషేధం విధించింది. ఎటువంటి భారతీయ కళాకారుడు పాకిస్తానీ నటులతో కలిసి పనిచేయకూడదని, ఏ అంతర్జాతీయ వేదికను వారితో పంచుకోకూడదని స్పష్టం చేసింది.
మరోవైపు ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత వస్తున్న ఈ పరిణామాలు ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను మరింత దిగజార్చే అవకాశం ఉంది. గతంలో కూడా ఉగ్రదాడుల నేపథ్యంలో పాకిస్తానీ కళాకారులపై నిషేధం విధించాలని డిమాండ్లు వచ్చిన విషయం తెలిసిందే. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత ఈ డిమాండ్లు మరింత బలపడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయంపై భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని ఇతర సంఘాలు మరియు ప్రముఖుల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి. అయితే, AICWA మాత్రం తమ డిమాండ్‌ను గట్టిగా వినిపిస్తోంది.