యంగ్ హీరో సుధీర్ బాబు , ఆనంది జంటగా నటిస్తున్న చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. ఆగస్ట్ 27న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు జరుపుతున్నారు.ఈ సినిమాకు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ అండదండగా ఉన్నాడు. ఈ సినిమా యూనిట్‌ను ప్రత్యేకంగా కలిసి తన బెస్ట్ విషెస్ తెలిపారు ప్రభాస్. శ్రీదేవి సోడా సెంటర్ కచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందని చెప్పారు ప్రభాస్.
పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో 70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తుండగా, ఇప్పటి వరకు సినిమాకు సంబంధించి విడుదలైన ప్రచార చిత్రాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా నుంచి మరో లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. ‘చుక్కల మేళం .. దిక్కుల తాళం .. ఒక్కటయే ఈ సంబరం .. ఆ సాంతం నీ సొంతం’ అంటూ ఈ పాట సాగుతోంది.
ఖవాలి వరుసల్లో మణిశర్మ ఈ బాణీ కట్టారు. ఈ తరహా పాటలు బాగా చేస్తారనే పేరు మణిశర్మకు ఉంది. కల్యాణ్ చక్రవర్తి సాహిత్యం .. అనురాగ్ కులకర్ణి ఆలాపనతో ఈ పాట సాగింది. గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథగా శ్రీదేవి సోడా సెంటర్ చిత్రాన్ని తెరకెక్కించారు. 84 బోట్లతో చిత్రీకరించిన క్లైమాక్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. ఈ సినిమా థియెట్రికల్ రైట్స్ రూ.12 కోట్లకు అమ్ముడయినట్టు తెలుస్తుంది.