‘ఇందులో నా పాత్ర గురించి చెప్పినప్పుడు చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది. అందుకే ఆ పాత్ర గురించి ఎక్కడా రివీల్ చేయకుండా సర్ప్రైజ్లా ఉంచాం. దాదాపు ఏడు గంటలు టెస్ట్ షూట్ చేసి, నా పాత్రని ఫైనలైజ్ చేశారు. ఇలాంటి యూనిక్ క్యారెక్టర్ చేయడం చాలా ఆనందంగా ఉంది.’ అని నటుడు, కొరియోగ్రాఫర్ శాండీ మాస్టర్ అన్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ నటించిన హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. కౌశిక్ పెగల్లపాటి దర్శకుడు. సాహు గారపాటి నిర్మాత. ఇటీవల విడుదలైన ఈ సినిమాలో శాండీ మాస్టర్ కీలక పాత్ర పోషించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆ పాత్ర తాలూకు అనుభవాలను శాండీ మాస్టర్ విలేకరులతో పంచుకున్నారు. ‘కిష్కింధపురి’ విజయం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. చిన్నప్పుడు నా కళ్లను చూసి ‘డెత్ గోట్ ఐస్’ అంటూ అందరూ ఆటపట్టించేవారు.
ఇప్పుడు ఆ కళ్లే నాకు ఆనందాన్నిచ్చాయి. ఆ కళ్లను చూసే లోకేష్ కనకరాజ్ ‘లియో’లో క్యారెక్టర్ ఇచ్చారు. ‘లియో’ తర్వాత అన్నీ సైకో క్యారెక్టర్లే వచ్చాయి. అలాంటి సమయంలో ‘లోక’, ‘కిష్కింధపురి’ చిత్రాలు నన్ను కొత్తగా ప్రజెంట్ చేశాయి. విభిన్నమైన పాత్రలతో విజయాలను అందుకోవడం ఆనందంగా ఉంది. ముఖ్యంగా ‘కిష్కింధపురి’లోని పాత్రకు గొప్ప స్పందన లభించింది. లోకేష్ కనకరాజ్, పా.రంజిత్ ఈ సినిమా చూసి నన్ను అభినందించారు.’ అని తెలిపారు శాండీ. కొరియోగ్రఫీ, యాక్టింగ్ తనకు రెండు కళ్లు అని, దర్శకత్వంపై కూడా ఆసక్తి ఉందని, పా రంజిత్ నిర్మాణంలో హీరోగా ఓ సినిమా చేస్తున్నానని, మలయాళ సినిమా ‘కథామినార్’లో కీలక పాత్ర పోషిస్తున్నానని, అలాగే ‘ఓజీ’లో ప్రమోషనల్ సాంగ్‌కి కొరియోగ్రఫీ అందించానని శాండీ మాస్టర్ తెలియజేశారు.