ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు లారెన్స్ కెరీర్ పరంగా జోరు పెంచారు. ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నారాయన. ఈ మూడింటినీ సమాంతరంగా పూర్తిచేసేందుకు ప్రణాళికతో ముందుకెళ్తున్నారట లారెన్స్. వాటిలో ‘బెంజ్’ చిత్రం చిత్రీకరణ దశలో ఉండగా, ఇటీవలే ప్రకటించిన రమేష్‌వర్మ చిత్రం షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.
ఇంకోవైపు ‘కాంచన 4’కి సంబంధించిన కసరత్తులు ముమ్మరం చేశారు. ఇప్పటివరకూ ‘కాంచన’ ఫ్రాంచైజీ దక్షిణాది ప్రేక్షకుల్ని మాత్రమే అలరించింది. ఈ నాలుగో భాగం మాత్రం పాన్ఇండియా స్థాయిలో తెరకెక్కించనున్నారట లారెన్స్. ఇందులో కథ రీత్యా ముగ్గురు హీరోయిన్లు ఉంటారట. వారిలో ఓ పాత్రకు బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్‌ని అనుకుంటున్నారట.
‘స్త్రీ 2’తో 800కోట్ల విజయాన్ని ఖాతాలో వేసుకొని ఫుల్ జోష్‌మీద ఉన్నది శ్రద్ధాకపూర్. ‘కాంచన 4’ కూడా కామెడీ హారర్ సినిమానే కావడంతో ఇందులో నటించేందుకు శ్రద్ధా ఉత్సాహం చూపిస్తున్నారట. మిగతా ఇద్దరు దక్షిణాది హీరోయిన్లే ఉంటారని తెలుస్తున్నది. త్వరలోనే ‘కాంచన 4’ పట్టాలెక్కనుంది. ఈ మూడు షూటింగ్‌లూ సమాంతరంగా జరుగనున్నాయి.